సత్యసాయి మెచ్చిన పకోడి...! | Sathya sai baba likes kalluru pakodi | Sakshi
Sakshi News home page

సత్యసాయి మెచ్చిన పకోడి...!

Published Sun, Apr 3 2016 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

సత్యసాయి మెచ్చిన పకోడి...!

సత్యసాయి మెచ్చిన పకోడి...!

పకోడి... ఈ పేరు వింటే చాలు ఎంతో మంది నోళ్లూరిపోతుంటాయి. పకోడి అంటే ఇష్టంలేని వాళ్లు బహుశా ఉండరేమో. హాట్ ఐటమ్స్‌లో దీని  ప్రత్యేకతే వేరు. ఇక పకోడీల్లో కల్లూరు పకోడి వేరయా అని చెప్పకతప్పదేమో. అంత ఫేమస్ కల్లూరు పకోడి.
 
గార్లదిన్నె: అనంతపురం కల్లూరు రైల్వే స్టేషన్‌లో ఏదైనా ఒక రైలు ఆగిందంటే చాలు ప్రయాణికులంతా ఓ దగ్గర గుమిగూడుతుంటారు. మాకివ్వండి... మాకివ్వండి అంటూ హడావుడి చేస్తుంటారు. ఇదంతా దేనికంటే ఇకెందుకు ఇక్కడ లభించే పకోడి కోసమే అని వేరే చెప్పాలా. గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే క్యాంటీన్‌లో మాత్రమే ఈ స్పెషల్ పకోడి లభిస్తుంది.


ఈ క్యాంటీన్ నిర్వాహకులు తండ్రీకొడుకులే. వారే కల్లూరు ఆర్‌ఎస్‌కు చెందిన వి.నరసింహ, వి. శశికాంత్‌లు. కర్నాటకలోని ఉడిపి జిల్లా కుందాపురం తాలుకాకు చెందిన వి. నరసింహారావు కుటుంబం 50 ఏళ్ల క్రితం కల్లూరు ఆర్‌ఎస్‌కు వచ్చారు. 1964లో వి. నరసింహ చిన్నాన్న శంకర్ కల్లూరు రైల్వే క్యాంటీన్ నిర్వహణను దక్కించుకున్నారు. దీంతో నరసింహారావు తన కుటుంబంతో ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో 13 ఏళ్ల పాటు చిన్నాన్న శంకర్‌కు క్యాంటీన్ నిర్వహణలో నరసింహరావు తోడ్పాటునందించే వారు. ఆయన నిర్యాణంతో క్యాంటీన్ నిర్వహణ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కుమారుడు శశికాంత్‌తో కలిసి శుచి, రుచికరమైన పకోడీని తయారు చేయడలం ప్రారంభించాడు.


అనతికాలంలోనే వారి పకోడీకి మంచి పేరు వచ్చింది. అంతేకాదు వీరి పకోడి అప్పట్లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఎంతో ప్రీతిగా తినేవారంట. వీరు పకోడితో పాటు రుచికరమైన ఇడ్లీ,  వడ, కాఫీ క్యాంటీన్‌లో విక్రయిస్తారు.  
 
 
 ప్యాకింగ్ వెరీ వెరీ స్పెషల్
 మామూలుగా బయట ఎక్కడ తీసుకున్న పకోడి అయినా ఏ పేపర్లోనో... కవర్లోనే ఇస్తుంటారు ఇది రొటీనే. అయితే కల్లూరు రైల్వే క్యాంటీన్‌లో మాత్రం ఎండిన ఇస్తరాకుల్లో ప్యాక్ చేసి ఇస్తారు. ధర కూడా బయటతో పోల్చి చీస్తే తక్కువే. ఒకప్పుడు రూ. 2 కే  పకోడి పొట్లం దొరికేది. ఆతర్వాత రూ. 3 చివరికి ఇప్పుడు రూ.5కు దీన్ని విక్రయిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటంతో కొనేవారు కూడా ఎక్కువే.
 
 రుచికరమైన పకోడీయే మా ప్రత్యేకత
 రుచికరమైన పకోడితోనే మా క్యాంటీన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పకోడి తయారీలో నాణ్యతగల శనగపిండి, రీఫండ్ ఆయిల్, పూనా ఉల్లితో పాటు కొద్ది మోతాదులో ఉర్లగడ్డలను ఉపయోగిస్తాం. భద్రంగా ప్యాక్ కూడా చేస్తాం. ఈ పకోడిని 15 రోజుల తర్వాత తిన్నా దాని రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. రోస్ట్ తగ్గదు. బూజు పట్టదు. అందుకే మా పకోడికి అంత గిరాకీ.     
 - వి.నరసింహ, క్యాంటీన్ ఓనర్, కల్లూరు ఆర్‌ఎస్
 
 
 
 తక్కువ ధరకే తినుబండారాలు
 తినుబండారాలను మా కుటుంబ సభ్యులమే తయారు చేస్తాం. అమ్మానాన్నతో పాటు నేనూ దాని తయారీకి సహాయం చేస్తుంటా. సొంత తయారీతో నాణ్యత లోపాన్ని అధిగమిస్తుండటంతో మా తినుబండారాలకు మంచిగిరాకీ. రైల్వే నిర్ణయించిన ధరల కంటే తక్కువకే విక్రయిస్తుండడంతో క్యాంటీన్‌కు గుర్తింపు లభించింది.
  - వీ. శశికాంత్
 
 పకోడి తినందే వెళ్లరు
 క్యాంటిన్‌లో లభించే పకోడి చాలా రుచికరమైంది. 23 ఏళ్లుగా ఈ పకోడి రుచి చూస్తున్నా. స్టేషన్‌ను సందర్శించే రైల్వే ఉన్నతాధికారులు పకోడి రుచి చూడందే వెళ్లరు. సందర్శనకు ముందురోజే వారు పకోడి టాపిక్ తేవందే రారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement