తండ్రి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె మనీలా, కుమారుడు కరణ్‌సింగ్
- గుండెపోటుతో మృతి
- ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల సంతాపం
- బాబోజీతండాలో అంత్యక్రియలు
- హాజరైన అధికారులు, నేతలు
ఖమ్మం:
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ తేజావత్ ధన్‌సింగ్ (50) గుండెపోటుతో శనివారం మృతిచెందారు. నగరంలోని నెహ్రూనగర్‌లో తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లెపల్లి శివారు బాబోజీతండాలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారులు, ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ధన్‌సింగ్ హఠాన్మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని నెహ్రూనగర్‌లోని అపార్ట్‌మెంట్ నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నివాసం ఉండే ఇంటిలోకి తరలించారు. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న మనీలా, హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు కరణ్‌సింగ్ తండ్రి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. ధన్‌సింగ్ తండ్రి, సోదరులు, బంధువుల సూచన మేరకు మృతదేహాన్ని ఖమ్మం నుంచి బాబోజీతండా వరకు ర్యాలీగా తీసుకెళ్లారు.
ప్రముఖుల సంతాపం
ధన్‌సింగ్ జిల్లా వాసి కావడం, సుదీర్ఘకాలం ఇక్కడే పనిచేయడంతో పలువురితో ఆయనకు సంబంధ బాంధవ్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నివాళి అర్పించిన వారిలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం మేయర్ పాపాలాల్, టీఎస్‌పీఎస్ డైరెక్టర్ బాణోత్ చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిశోర్, ఎన్సీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటనారాయణ, డైరెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు, డీఈలు నాగప్రసాద్, సురేందర్, రవి, బాబూరావు, ఏఎస్వో రెడ్డి, ఏఓ డేవిడ్, ఏడీలు నందా రాథోడ్, బాలాజీ, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శేషగిరిరావు, ప్రసాద్, ఎం.సత్యనారాయణరెడ్డి, గోపాల్, యుగందర్, నరేశ్‌కుమార్, కళాధర్‌రెడ్డి, ముకుందరెడ్డి తదితరులు ఉన్నారు.
ధన్‌సింగ్ ప్రస్థానం
ఖమ్మంలోనే పాఠశాల, జూనియర్ కళాశాల విద్యనభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. విద్యుత్‌శాఖలో ఏఈగా ఉద్యోగంలో చేరిన ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. డీఈగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కొంతకాలం పనిచేశారు. ఖమ్మం టెక్నికల్, ఆపరేషన్ డీఈగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎస్‌ఈ తిరుమలరావు బదిలీ కావడంతో పదోన్నతిపై ధన్‌సింగ్ గతేడాది ఆ బాధ్యతలు స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన ధన్‌సింగ్ మారుమూల గిరిజన ప్రాంతాల విద్యుదీకరణకు కృషి చేశారు.