hartattac
-
కడచూపు దక్కింది
బతుకు దెరువు కోసం సరిహద్దులు దాటివెళ్లాడు. అక్కడే పనిచేస్తూ హఠాత్తుగా గుండెనొప్పికి గురై మృతి చెందాడు. పేదరికం కావడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఆయన కుటుంబానిది. కడచూపైనా దక్కుతుందో లేదో అని భార్య, పిల్లలు తీవ్ర ఆవేదన చెందారు. అయితే అక్కడి యాదవుల చేయూతతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు కడచూపు దక్కేలా చేశారు. కాశినాయన : జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి మృతి చెందిన చలమల వెంకటేశ్వర్లు(45) కుటుంబీకులకు కడచూపు దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని నరసన్నపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూన్నెల్ల కిందట తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. నెల కిందట మళ్లీ వెళ్లాడు. గత మంగళవారం కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. తల్లికి ఫోన్ ఇవ్వాలని కోరుతూ అక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు. చేయూతనిచ్చిన యాదవ పెద్దలు విషయాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేత కరెంట్ రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి నియోజకవర్గానికి చెందిన పలువురు యాదవులను ఆ కుటుంబానికి సాయమందిచాలని కోరా రు. పలు ప్రాంతాలకు చెందిన యాదవ ప్రముఖులు దాదాపు చందాల రూపంలో రూ.లక్ష వసూలు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియాకు తరలించేదుకు శరవేగంగా పనులు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి స్వగ్రామానికి వెంకటేశ్వర్లు మృతదేహం చేరింది. కూలి కోసం వెళ్లి మరణించిన భర్త, తండ్రిని చూసి ఆయన భార్య దుగ్గమ్మ, ఇద్దరు కుమార్తెల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబానికి స్వాంతన కుటుంబానికి పెద్ద దిక్కు వెంకటేశ్వర్లు మృతితో ఆయన భార్య, కుమార్తెలు దిక్కులేని వారుగా మారారు. విషయం తెలుసుకున్న కువైట్ యాదవ సంఘం రూ.లక్ష, కువైట్ ఎన్ఆర్ఐ సంఘం రూ. 50 వేలను అందించేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తారని వైఎస్సార్సీపీ నాయకులు కరెంట్ రమణారెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు బద్వేలు కౌన్సిలరు గోపాలస్వామి, గోపవరం సింగిల్‌విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య ఆచారి, ఎంపీపీ పెద్ద రామ య్య, నాయకులు జగన్ మోహన్‌రెడ్డి, నాగారెడ్డి రామసుబ్బారెడ్డి, రాజుగాళ్ల వెంకటరెడ్డి తదితరులు వెంకటేశ్వర్లు మృతదేహానికి నివాళులర్పించారు. -
నిరుపేదను ఆదుకోరూ..!
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్‌స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వేధించిన అప్పులు.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు... ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్‌వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్ క్లబ్ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ (నల్లగొండ మైత్రి ఉమెన్స్ కాలేజ్ బ్రాంచ్)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది. -
ఎస్ఈ ధన్సింగ్ హఠాన్మరణం
గుండెపోటుతో మృతి ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల సంతాపం బాబోజీతండాలో అంత్యక్రియలు హాజరైన అధికారులు, నేతలు ఖమ్మం: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ తేజావత్ ధన్సింగ్ (50) గుండెపోటుతో శనివారం మృతిచెందారు. నగరంలోని నెహ్రూనగర్‌లో తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లెపల్లి శివారు బాబోజీతండాలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారులు, ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ధన్సింగ్ హఠాన్మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని నెహ్రూనగర్‌లోని అపార్ట్మెంట్ నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నివాసం ఉండే ఇంటిలోకి తరలించారు. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న మనీలా, హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు కరణ్‌సింగ్ తండ్రి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. ధన్సింగ్ తండ్రి, సోదరులు, బంధువుల సూచన మేరకు మృతదేహాన్ని ఖమ్మం నుంచి బాబోజీతండా వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. ప్రముఖుల సంతాపం ధన్సింగ్ జిల్లా వాసి కావడం, సుదీర్ఘకాలం ఇక్కడే పనిచేయడంతో పలువురితో ఆయనకు సంబంధ బాంధవ్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నివాళి అర్పించిన వారిలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం మేయర్ పాపాలాల్, టీఎస్పీఎస్ డైరెక్టర్ బాణోత్ చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిశోర్, ఎన్సీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటనారాయణ, డైరెక్టర్ బుగ్గవీటి వెంకటేశ్వరరావు, డీఈలు నాగప్రసాద్, సురేందర్, రవి, బాబూరావు, ఏఎస్వో రెడ్డి, ఏఓ డేవిడ్, ఏడీలు నందా రాథోడ్, బాలాజీ, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శేషగిరిరావు, ప్రసాద్, ఎం.సత్యనారాయణరెడ్డి, గోపాల్, యుగందర్, నరేశ్‌కుమార్, కళాధర్‌రెడ్డి, ముకుందరెడ్డి తదితరులు ఉన్నారు. ధన్సింగ్ ప్రస్థానం ఖమ్మంలోనే పాఠశాల, జూనియర్ కళాశాల విద్యనభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. విద్యుత్‌శాఖలో ఏఈగా ఉద్యోగంలో చేరిన ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. డీఈగా పదోన్నతి పొంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కొంతకాలం పనిచేశారు. ఖమ్మం టెక్నికల్, ఆపరేషన్ డీఈగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఎస్ఈ తిరుమలరావు బదిలీ కావడంతో పదోన్నతిపై ధన్సింగ్ గతేడాది ఆ బాధ్యతలు స్వీకరించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన ధన్సింగ్ మారుమూల గిరిజన ప్రాంతాల విద్యుదీకరణకు కృషి చేశారు.