నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
బతుకు దెరువు కోసం సరిహద్దులు దాటివెళ్లాడు. అక్కడే పనిచేస్తూ హఠాత్తుగా గుండెనొప్పికి గురై మృతి చెందాడు. పేదరికం కావడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఆయన కుటుంబానిది. కడచూపైనా దక్కుతుందో లేదో అని భార్య, పిల్లలు తీవ్ర ఆవేదన చెందారు. అయితే అక్కడి యాదవుల చేయూతతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు కడచూపు దక్కేలా చేశారు.
కాశినాయన : జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి మృతి చెందిన చలమల వెంకటేశ్వర్లు(45) కుటుంబీకులకు కడచూపు దక్కింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని నరసన్నపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. మూన్నెల్ల కిందట తండ్రి మరణిస్తే స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. నెల కిందట మళ్లీ వెళ్లాడు. గత మంగళవారం కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. తల్లికి ఫోన్ ఇవ్వాలని కోరుతూ అక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి గురయ్యారు.
చేయూతనిచ్చిన యాదవ పెద్దలు
విషయాన్ని స్థానిక వైఎస్సార్‌సీపీ నేత కరెంట్ రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి నియోజకవర్గానికి చెందిన పలువురు యాదవులను ఆ కుటుంబానికి సాయమందిచాలని కోరా రు. పలు ప్రాంతాలకు చెందిన యాదవ ప్రముఖులు దాదాపు చందాల రూపంలో రూ.లక్ష వసూలు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియాకు తరలించేదుకు శరవేగంగా పనులు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి స్వగ్రామానికి వెంకటేశ్వర్లు మృతదేహం చేరింది. కూలి కోసం వెళ్లి మరణించిన భర్త, తండ్రిని చూసి ఆయన భార్య దుగ్గమ్మ, ఇద్దరు కుమార్తెల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
బాధిత కుటుంబానికి స్వాంతన
కుటుంబానికి పెద్ద దిక్కు వెంకటేశ్వర్లు మృతితో ఆయన భార్య, కుమార్తెలు దిక్కులేని వారుగా మారారు. విషయం తెలుసుకున్న కువైట్ యాదవ సంఘం రూ.లక్ష, కువైట్ ఎన్‌ఆర్‌ఐ సంఘం రూ. 50 వేలను అందించేందుకు ముందుకు వచ్చాయి. త్వరలోనే ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు కరెంట్ రమణారెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బద్వేలు కౌన్సిలరు గోపాలస్వామి, గోపవరం సింగిల్‌విండో అధ్యక్షుడు సుందరరామిరెడ్డి, జెడ్పీటీసీ వెంకటసుబ్బయ్య ఆచారి, ఎంపీపీ పెద్ద రామ య్య, నాయకులు జగన్ మోహన్‌రెడ్డి, నాగారెడ్డి రామసుబ్బారెడ్డి, రాజుగాళ్ల వెంకటరెడ్డి తదితరులు వెంకటేశ్వర్లు మృతదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment