మట్టివాసనే కట్టిపడేసింది | shamirpet young man vanga kiran kumar reddy quit job for land | Sakshi
Sakshi News home page

మట్టివాసనే కట్టిపడేసింది

Published Sun, Nov 8 2015 1:03 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

మట్టివాసనే కట్టిపడేసింది - Sakshi

మట్టివాసనే కట్టిపడేసింది

శామీర్‌పేట్: కాస్త ఉన్నత చదువులు చదవగానే ఉద్యోగ నిమిత్తం విదేశాలవైపు మళ్లే వారిని చూస్తుంటాం.. వీసాల కోసం నిత్యం పాకులాడే  వారెందరినో గమనిస్తుంటాం.. స్వదేశంలో ఏముంది అక్కడే స్థిరపడి కాస్తాకూస్తో వెనకేసుకుందాం అని ఆరాటపడేవాళ్లు ఎందరో.. చిన్న ఉద్యోగమైనా సరే ఛాన్స్ దొరికితే విమానం ఎక్కేద్దాం.. విదేశాల్లో వాలిపోదాం అని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన మాత్రం అలా కాదు.. నెలకు లక్షా 75 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని స్వదేశానికి పయనమయ్యారు.

విదేశం కన్నా ఇక్కడి మట్టివాసన మిన్న అంటూ సొంత ఊరికి వచ్చేశాడు. వ్యవసాయమంటేనే ఆమడ దూరం నిలుస్తున్న యువతకు దాన్నే ఎంచుకొని అందులోనే సరికొత్త పోకడలతో లాభాల సిరులు పండిస్తూ మార్గదర్శకమయ్యారు.. ఇష్టంతో కష్టపడి ముందుకు ‘సాగు’తున్నారు. అటు కుటుంబానికి ఆసరాగా మారి.. ఇటు ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. ఆయనే వంగ కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆయన స్ఫూర్తిదాయక కథనమే ఈ ఆదివారం ప్రత్యేక కథనం..

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం పోతారం గ్రామానికి చెందిన వంగ బుచ్చిరెడ్డి, మల్లమ్మ దంపతులు. వ్యవసాయం వీరి జీవనాధారం. వీరికి  ముగ్గురు సంతానం.  కిరణ్‌కుమార్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి (ప్రస్తుతం మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు), పవన్‌కుమార్‌రెడ్డి (చదువు పూర్తయింది). పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. కష్టపడి చదువుతున్న కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. తాము పస్తులుం డైనా ఉన్న పొలంలో వచ్చిన ప్రతి పైసా అతని చదువులకు దార పోశారు. అలా కిరణ్‌కుమార్ రెడ్డి ఎంఎస్సీ పూర్తి చేశాడు.

ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో లండన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎంతో ఆనందించారు. 2009లో కిరణ్‌కుమార్‌రెడ్డి అలా లండన్ బయలు దేరాడు. అక్కడ నెలకు దాదాపు రూ.లక్ష 75వేలు వేతనం లభించినప్పటికీ ఏదో తెలియని వెలితి.. అసంతృప్తి. స్వదేశం.. పుట్టిపెరిగిన ఊరు.. కన్నతల్లిదండ్రులవైపే మనసు మళ్లేది. ఆ తలపులతోనే మూడేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో 2012 నవంబర్‌లో తండ్రి అస్వస్థతకు గురయ్యాడన్న విషయం తెలిసింది. అంతే ఇక ఉండబట్టలేక ఆఘమేఘాల మీద స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు.

అలా ముందుకు ‘సాగు’తూ..
కిరణ్‌కుమార్‌రెడ్డి ఊరికి వచ్చినప్పుడు నీళ్లు లేక పొలం మొత్తం బీడుగా తయారైంది. ఈ తరుణంలో ఏ పంటలు వేస్తే అనతికాలంలో లాభాలబాట పట్టొచ్చు అని ఆలోచిం చాడు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించొచ్చని నిర్ణయించుకున్నాడు.  ఉన్న 40 ఎకరాల్లో డ్రిప్ సాయంతో 20 ఎకరాల్లో దానిమ్మ, పది ఎకరాల్లో వివిధ రకాల తీగజాతి పంటలు, మరోపది ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర సీజనల్ పంటలు పండిస్తున్నాడు.

బ్యాంక్ రుణం, ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో తీగజాతి, ఇతర పంటలతో  అనుకున్నది సాధిం చాడు. లాభాల బాటలో పయనమవుతున్నాడు. నెలకు దాదాపు రూ.45వేల నుంచి రూ.60వేల వరకు సంపాదిస్తున్నాడు. శాస్త్రవేత్తలు, నాయకులు, అధికారులు, ఇలా ప్రతి ఒక్కరినీ ఆక ర్షించేలా త న పొలాన్ని తయారుచేశాడు.  పాలీహౌస్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోపదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు మండలంతో పాటు వివిధ మండలాలకు చెందిన ఎందరో రైతులు కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వచ్చి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకుంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి భార్య, పాప ఉన్నారు.
 
మనసు అంగీకరించక.. తిరిగి వెళ్లలేక..
స్వదేశానికి వచ్చాక తిరిగి వెళ్లాలంటే మనసు అంగీకరించలేదు. కష్టపడి పెంచి, విద్యాబుద్ధులు చెప్పిచ్చిన కన్నవారిని వదిలి వెళ్లడానికి అడుగులు ముందుకుపడలేదు. ఇక ఇక్కడే ఉండి వారికి ఆసరాగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటూ.. తనకున్న పరిజ్ఞానంతో వివిధ రకాలు పంటలు పండించాలని భావించాడు. దీంతో ఇటు తల్లిదండ్రులు, అటు గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలే నీళ్లు లేక వ్యవసాయం అంతంతమాత్రంగా మారింది.. అందులోనూ విదేశాల్లో ఉండొచ్చిన నువ్వు వ్యవసాయం ఏం చేస్తావులే అని ప్రశ్నించారు. ఆ మాటలు అతనిలో మరింత కసిని పెంచాయి. గ్రామానికి సమీపంలో తమకున్న 40 ఎకరాల బంజరు భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు.
 
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే..
స్వదేశంపై మమకారంతో ఇక్కడికి వచ్చేశాను. చిన్న ఆలోచన పెద్ద విజయాన్ని అందిస్తుంది. కావాల్సిందిల్లా పట్టుదల, ఏకాగ్రత. కుటుంబసభ్యులు, గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు లాభాల సిరులు పండిస్తున్నాను. రైతులు సాగులో కాస్త మెలకువలు పాటి స్తే అనతి కాలంలోనే మంచి లాభాలు గడించే అవకాశం ఉంది.
 - కిరణ్‌కుమార్‌రెడ్డి
 
సంతోషంగా ఉంది..
పిల్లలను మంచి హోదాలో చూడాలని ఆశపడ్డాం. కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డాడని ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు మా దగ్గరలేడని బాధపడేవాళ్లం. ఇంటికి వచ్చేస్తానన్నప్పుడు ఒకింత సంబరపడ్డా, ఇక్కడేం చేస్తాడని ఆందోళనకు గురయ్యాం. ప్రస్తుతం ఆ బాధ తీరిపోయింది. తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది.  
 - బుచ్చిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి
 
 అతని విజయం ఆదర్శం..
కిరణ్ చిన్ననాటి నుంచి చురుగ్గా ఉండే వాడు. అతని తెలివితేటలతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించాడు. మంచి ఉద్యోగం మానుకోవడం, ఇక్కడే స్థిరపడాలనుకోవడం అతనికి తల్లిదండ్రుల మీద, దేశం మీద ఉన్న మమకారానికి అద్దం పడుతోంది. వ్యవసాయమంటే కష్టంగా భావిస్తున్న తరుణంలో అందులో అతను విజయం సాధించిన తీరు ఆదర్శంగా నిలుస్తుంది.
 - దేవందర్‌రెడ్డి, పొన్నాల్ రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement