పంది కనిపిస్తే కాల్చివేత
– వారం రోజులు డెడ్‌లైన్
– కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ డైరెక్టర్ కన్నబాబు ఆదేశం
నంద్యాల: పట్టణంలో పందులు కనిపిస్తే కాల్చివేస్తామని, పందుల యజమానులపై నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తామని పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు హెచ్చరించారు. కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఆదివారం పందుల పెంపకం దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పందులను నిర్మూలించక తప్పదని చెప్పారు. వందమంది ఉపాధి కోసం లక్షల మంది ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం మంచిది కాదన్నారు. గతంలో పలుమార్లు పందుల పెంపకందారులను హెచ్చరించినా ఖాతరు చేయలేదని, బెదిరింపులకు, దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పందుల సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, నిర్మూలనను నంద్యాల నుండే ప్రారంభిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లోగా పందులను ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలని, లేకపోతే తమ ఇళ్లవద్దనే పెట్టుకోవాలని సూచించారు.
పీవీనగర్ వద్ద 3.5ఎకరాలు కేటాయింపు...
పందుల పెంపకం దారుల కోసం పీవీనగర్ వద్ద 3.50ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పందులను ఈ స్థలంలో ఉంచుకోవాలని, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
మున్సిపాలిటీ ఉత్తర్వులు బేఖాతరు...
పట్టణంలో బయటిపేట, మూలసాగరం, నూనెపల్లె ప్రాంతాల్లో పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 95 కుటుంబాలు జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరు కావాలని మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు. అయితే, సమావేశానికి 15మంది మాత్రమే హాజరు కాగా 80 మంది డుమ్మా కొట్టారు. వచ్చిన వారితో కలెక్టర్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని హామీ పత్రంపై సంతకాలు చేయించుకున్నారు. సమావేశంలో ఆర్‌డీఓ రామసుందర్‌రెడ్డి డీఎస్పీ హరినాథరెడ్డి, చైర్‌పర్సన్ దేశం సులోచన కమిషనర్ సత్యనారాయణ, సీఐలు గుణశేఖర్‌బాబు, శ్రీనివాసరెడ్డి, ఇస్మాయిల్, రూరల్ ఎస్‌ఐ రమణ, తదితరులు పాల్గొన్నారు.