అక్రమ సంతకం కేసు అటకెక్కినట్లేనా?
► తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్‌ను దుర్వినియోగం చేసిన ఘనులు
► నరసరావుపేటలో ఫ్యామిలీ మెంబర్ పత్రం జారీకి భారీగా ముడుపులు
► తహసీల్దార్ ఫిర్యాదు చేసినా కదలని విచారణ
► మూడు నెలలుగా సాగదీత
సాక్షాత్తు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగం అయి కేసు నమోదైనా పట్టించుకోని దుస్థితి. కేసు దాఖలు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ అతీగతీ లేకపోవడం గమనార్హం. నరసరావుపేటలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో జరిగిన ఈ అక్రమంలో అధికార పార్టీ నాయకులు తలదూర్చి నిందితులను విచారించకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాగోతంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. – నరసరావుపేట టౌన్
మండలంలోని రావిపాడుకు చెందిన పుట్టి ఇన్నయ్య గతేడాది జులైలో మృతి చెందాడు. తర్వాత మృతుడి కుమార్తె అమల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం దరఖాస్తు చేసుకుంది. విచారణ చేపట్టిన అధికారులు అదే ఏడాది ఆగస్ట్‌లో సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. తర్వాత అనూహ్యంగా రమేష్ అనే వ్యక్తి తానూ ఇన్నయ్య కుమారుడినంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా విచారించిన అధికారులు సర్టిఫికెట్‌ను తిరస్కరించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ రమేష్ అనూహ్యంగా సర్టిఫికెట్ పొందాడు. దీనిపై ఇన్నయ్య కుమార్తె అమల మూడు నెలల క్రితం తహసీల్దార్ విజయజ్యోతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
క్రిమినల్ కేసు నమోదు...
ఫిర్యాదు అందిన తర్వాత సదరు తహసీల్దార్ తన డిజిటల్ సిగ్నేచర్‌ను దుర్వినియోగం చేసి సర్టిఫికెట్ జారీ చేశా>రని తహసీల్దార్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత కార్యాలయ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కుమారిపై కేసు దాఖలైంది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్ న్యాయస్థానంలో లొంగిపోయాడు. అనే పరిణామాల పిదప బెయిల్ కూడా పొందాడు.
విచారణ శూన్యం..
కంప్యూటర్ ఆపరేటర్ మినహా మిగతా ఉద్యోగులు, సర్టిఫికెట్ పొందిన రమేష్ అనే వ్యక్తిని ఇప్పటివరకూ విచారించకపోవడం గమనార్హం. కేసును నీరుగార్చేందుకు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారిని కేసు నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాఖ పరమైన చర్యల్లో రాజకీయం..
సాధారణంగా ఉద్యోగులపై క్రిమినల్ æకేసులు నమోదైతే శాఖ పరమైన చర్యల్లో భాగంగా వారిని విధుల నుంచి తప్పించాల్సి ఉంది. తహసీల్దార్ డిజిటల్ సంతకం దుర్వినియోగం కేసులో నిందితులుగా ఉన్నవారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ ఉన్నతాధికారులపై కూడా రాజకీయ ఒత్తిళ్లు పనిచేసిన కారణంగానే చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
చేతులు మారిన ముడుపులు..
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయమై భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. దీనిలో ఓ వీఆర్వో, కార్యాలయ ఉద్యోగి కలసి ఈ అక్రమానికి పాల్పడినట్లు పట్టణంలో బహిరంగ ఆరోపణలే వినిపిస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే విచారణలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చి మూడు నెలలు గుడుస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.