మాకొద్దీ.. జోగినివ్యవస్థ | solve the joginies demands | Sakshi
Sakshi News home page

మాకొద్దీ.. జోగినివ్యవస్థ

Published Wed, Aug 24 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హాజమ్మ

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హాజమ్మ

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): ఏళ్ల తరబడి మమ్మల్ని జ్యోగినిలుగా గుర్తించడంతో అన్నీ కోల్పోతున్నామని తెలంగాణ రాష్ట్ర జ్యోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆందోళన, ఆవేదన వ్యక్తంచేశారు. తెలిసీ తెలియని వయసులో తమకు దేవుళ్లతో పెళ్లిళ్లు చేయడంతో మా పిల్లలకు తండ్రి ఎవరో చెప్పుకోలేని దుస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వెయ్యిమంది జ్యోగినిలతో సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ రాష్ట్ర జ్యోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ’ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన హజమ్మ, నిర్మల, నర్సమ్మ, చెన్నమ్మ, ఈశ్వరమ్మ, నర్సమ్మ విలేకరులతో మాట్లాడారు.

ఆరేళ్ల ప్రాయంలో గ్రామానికి, కుటుంబానికి మంచి జరుగుతుందనే నెపంతో దేవుళ్లతో తమకు పెళ్లిళ్లు చేశారన్నారు. ఆ తరువాత తమకు పిల్లలు పుట్టి వారు పెద్దవారై స్కూల్లో చేరే సమయంలో మీ తండ్రి ఎవరు, ఎవరికి పుట్టావు అని మా పిల్లలను అంటుంటే మేం ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జ్యోగినీ వ్యవస్థ లేదని చెప్పే ప్రభుత్వం బతుకమ్మ, బోనాలకు జ్యోగినీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని, వారిని జాతకం ఎందుకు చెప్పమంటున్నారని ప్రశ్నించారు. తామంతా దళితవర్గానికి చెందిన వారం కాబట్టే ప్రభుత్వం తమపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ‘మీరు దేవుడ్ని పెళ్లి చేసుకున్నారుగా... దేవుడు చచ్చిపోలేదుగా’ అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
 డిమాండ్లు నెరవేర్చాలి
వీరికి మద్దతుగా రచయిత్రిలు జోగు శ్యామల, జూపాక సుభద్ర మాట్లాడుతూ ప్రతి జ్యోగినికి రూ.3వేలు పింఛన్‌ను ఇవ్వాలని, మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని, ఉచితంగా స్థలంతో పాటు ఇల్లును కట్టించి ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న విలేజ్‌ సెక్రటరీ పోస్టులను 10వ తరగతి పాసైన జ్యోగినిల పిల్లలకు ఇవ్వాలని, రూ.1లక్ష నుంచి 5లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌లోని బడ్జెట్‌లో 10శాతం జ్యోగినీల అభివద్ధికి ఖర్చుచేయాలని, 1988జ్యోగిని నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని,  రఘునాథరావు కమిటీ రిపోర్టును అమలుచేయాలని కోరారు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement