తండ్రిని చంపిన తనయుడు
బనగానపల్లె రూరల్: కన్నతండ్రినే కుమారుడు గొడ్డలితో నరికి చంపిన ఘటన ఆదివారం బనగానపల్లెలో చోటు చేసుకుంది. స్థానిక తెలుగుపేట కాలనీలో నివాసముంటున్న బైరెడ్డి నడిపి వెంకట సుబ్బన్న(58), పుల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు బనగానపల్లెలో న్నారు. వీరిలో మూడో కుమారుడు రామకృష్ణకు వివాహమైంది. అతను రోజు మద్యం సేవించి ఆస్తి విషయంలో తండ్రితో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మంచంపై నిద్రిస్తున్న తండ్రి తలపై గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాకేష్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బనగానపల్లె వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటసాని రామిరెడ్డి హతుడి కుటుంబీకులను పరామర్శించారు.