‘సూదాపాలెం’ ఘటన అనాగరికం
తెలుగు రాష్ట్రాల ఆఫీసర్స్ ఫోరం ఉపాధ్యక్షుడు భరత్ భూషణ్
అమలాపురం : సూదాపాలెంలో ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితులపై.. అసలేం జరుగుతుందో వాస్తవాలను గ్రహించకుండా, అనాగరికంగా దాడులు చేశారని ఏపీ, తెలంగాణ ఆఫీసర్స్ ఫోరం తీవ్రంగా ఖండించింది. సూదాపాలెంలోని ఘటనా స్థలాన్ని ఆదివారం సందర్శించిన ఫోరం బృందం.. దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించింది. అమలాపురం జానకిపేటలోని బాధిత దళితులకు ఫోరం ఉపాధ్యక్షుడు అతిపట్ల భరత్‌భూషణ్‌తో కూడుకున్న ప్రతినిధుల బృందం ధైర్యం చెప్పింది. అనంతరం అక్కడే దళిత నాయకులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో భరత్ భూషణ్ మాట్లాడుతూ సూదాపాలెం ఘటనలో అసలైన దోషులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని విమర్శించారు. అప్పుడు దళితులు గాయపడినా, పోలీసులు వారిపై సానుభూతి చూపకుండా, దాడి చేసిన వారికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఆరోపించారు. దాడి సమయంలో అలక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎం.సిద్ధోజీ డిమాండ్ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. రోహిత్ వేముల తల్లి వేముల రాధిక, సోదరుడు రాజా, ఫోరం ప్రతినిధి కావూరి కరుణాకర్, దళిత నాయకులు బొంతు రమణ, గెల్లా వెంకటేష్, జల్లి శ్రీనివాసరావు, పరమట రాంప్రసాద్, పెయ్యల శ్రీనివాసరావు, దళిత స్త్రీ శక్తి రాష్ట్ర కన్వీనర్ కొంకి రాజామణి తదితరులు పాల్గొన్నారు.