గ్రీవెన్స్‌లో విన్నపాల వెల్లువ
గుంటూరు ఈస్ట్: జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మొత్తం 42 ఫిర్యాదులు స్వీకరించారు. నల్లచెరువు 22 వ లైనుకు చెందిన దాకోజు బాలత్రిపుర సుందరి తన ఫిర్యాదులో జూన్ నెలలో తన కుమార్తె నాగలక్ష్మీ ,ఆమె ఇద్దరు పిల్లలను అల్లుడు పేర్లి రమేష్ దారుణంగా హత్య చేసాడని పేర్కొంది. ఈ కేసులో రమేష్‌పై మాత్రమే పోలీసులు కేసు పెట్టారని హత్యకు సహకరించిన వారిని వదిలి వేసారని ఆరోపించింది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన పోలుబోయిన శివమ్మ తన ఫిర్యాదులో ఆస్తి తగాదా నేపథ్యంలో తన బాబాయి ఎడ్ల సాంబయ్య ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 3వ తేదీ తన వదినను బంధించి, తనపై దాడి చేసి నోట్లో పురుగుల మందు పోసారని పేర్కొంది. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం లేదని న్యాయం చేయాలని కోరింది. శ్రీనివాసరావుపేట 5వ లైనుకు చెందిన పోతల కన్యకాపరమేశ్వరి తన ఫిర్యాదులో పార్వతీపురానికి చెందిన పుల్లారావు వద్ద 50 వేలు వడ్డీకి తీసుకుని ప్రామిసరీ నోట్లు ,220 గజాల స్థలాన్ని హమీగా ఇచ్చామని పేర్కొంది. డబ్బులు చెల్లించినప్పుడు బ్యాంకులో ఉన్న కాగితాలు మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి వెళ్లి ఇప్పుడు ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.