శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించను
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించను
Published Sun, Jul 9 2017 4:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM
నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగం
రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరిక
కాకినాడ క్రైం : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని హెచ్చరించారు. శనివారం కాకినాడ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు నిర్వహించిన పరివర్తన సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు శాంతికాముకులని, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన తూర్పు గోదావరి ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సంఘ వ్యతిరేఖ కార్యకలాపాలు, సెటిల్‌మెంట్లు, దందాలు, కొట్లాటలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చెడు అలవాట్లు , నేర ప్రవత్తిని విడిచిపెట్టి సమాజంలో మంచిగా జీవించడం నేర్చుకోవాలన్నారు. రౌడీషీటర్ల పై పీడీయాక్టు ఉపయోగించి ఉక్కుపాదం మోపుతానన్నారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్లతో సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్క రౌడీషీటర్ల లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫోటో, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, వృత్తి వివరాలను తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాకినాడ ఎస్‌డీపీవో ఎస్.వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి,ట్రాఫిక్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐలు వి.దుర్గాప్రసాద్, ఏఎస్ రావు, మహ్మద్ ఉమర్, రూరల్ సీఐ వి.పవన్‌కిషోర్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. వన్‌టౌన్, టూ, త్రీ టౌన్, పోర్టు, సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 72 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు.
పాదయాత్ర కోసం దరఖాస్తు రాలేదు
ముద్రగడ పాదయాత్రకు అనుమతి కోసం ఎటువంటి దరఖాస్తు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ విశాల్ గున్ని సమాధానమిచ్చారు. ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమన్నారు. అందరూ చట్టానికి లోబడే పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement