నలుపు గెలుపు | special to black | Sakshi
Sakshi News home page

నలుపు గెలుపు

Published Sun, Jul 17 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

నలుపు గెలుపు

నలుపు గెలుపు

నలుపు రంగుకు మెరుపొచ్చింది. అందాల వేదికల నుంచి పిలుపొచ్చింది. తెలుపు, గులాబీ తదితర అగ్రగామి మేనిఛాయల సరసన చేరింది. సింపుల్‌గా చెప్పాలంటే నలుపు గెలుపు బాట పట్టింది. తాజాగా చెన్నైకి చెందిన తెలుగమ్మాయి గాయత్రీ రెడ్డి ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో ఫైనల్స్‌కి చేరింది. ఈమె ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’ పేరుతో ఆన్‌లైన్ ప్రచారం కూడా ప్రారంభించడం విశేషం. లాక్మే సైతం తన తాజా మోడలింగ్ ఆడిషన్స్‌లో ఒక బ్లాక్ బ్యూటీని ఎంపిక చేసుకుంది.             - ఎస్.సత్యబాబు
 
 తెల్ల వాళ్లను వెళ్లగొట్టినా భాష నుంచి రంగు వరకు దేన్నీ మన మనసుల్లోంచి వెళ్లగొట్టలేకపోయామనేది నిజం. అందుకు అందాన్నిచ్చే మేనిఛాయగా తెలుపు రంగుకు మన దగ్గర ఉన్న క్రేజ్ ఒక రుజువు. ఈ నేపథ్యంలో నల్లగా పుట్టడమేదో నేరమన్నంత దురావస్థ. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ విషయంలో సమస్యలు మరీ ఎక్కువే. ఈ రోజుకీ తెల్లని మేనిఛాయ అందిస్తామంటూ రూ.కోట్లు కొల్లగొడుతున్న కాస్మోటిక్ కంపెనీలే... అమ్మాయిలకు తమ ఒంటి రంగుపై ఉన్న ఆందోళనకు రుజువు. ఈ పరిస్థితుల్లో ర్యాంప్‌పై నల్లకలువలు పెద్ద సంఖ్యలో వికసిస్తుండడం బ్లాక్ కలర్ భవిష్యత్తుపై ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది. అయితే దీనికి సంబంధించి టాలీవుడ్‌లో ఇంకా మార్పు రాలేదనే చెప్పాలి. నల్లని మేనిఛాయ ఉన్న అమ్మాయిలను సాదరంగా ఆహ్వానించేందుకు సినిమా రంగం విముఖత చూపుతూనే ఉంది. ‘నా కలరే నాకు అవకాశాలు తెచ్చిపెట్టింది. చెన్నైలో 100కి పైగా యాడ్స్ చేశాను. అయితే డస్కీ కలర్‌కి టాలీవుడ్‌లో ఆదరణ లభించడం లేదనేది వాస్తవం’ అని నిన్నటి తరం నటి డిస్కో శాంతి సోదరి సుచిత్ర ‘సాక్షి’తో చెప్పారు.
 
 బ్లాక్ లుక్.. హిట్
 
 మోడలింగ్‌లో బ్లాక్ బ్యూటీస్ గతంలోనూ ఉన్నారు. అయితే మన వాళ్లు కొద్ది మందే. మిగిలిన వారంతా విదేశీయులే ఉండేవారు. తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. నాటి మధుసాప్రే నుంచి నేటి నీనా మాన్యూల్ వరకు చెప్పుకోదగిన సంఖ్యలో భారతీయ బ్లాక్ బ్యూటీలు ర్యాంప్‌పై సందడి చేస్తున్నారు. ఇటీవలే ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో చెన్నై మోడల్ గాయత్రీ రెడ్డి ఫైనల్స్‌కు చేరి మరోసారి బ్లాక్ బ్యూటీస్ క్రేజ్ పెంచారు. ‘అమ్మాయిలు తమ రంగు గురించి ఆందోళన చెందడం అనవసరం. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ఆలోచనలు మాని, తమ టాలెంట్‌కు, శక్తి యుక్తులకు మాత్రమే ప్రాధాన్యమివ్వాల’ని అంటున్నారు గాయత్రీ రెడ్డి. అనడమే కాదు ‘డార్క్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటూ ఆన్‌లైన్ ప్రచారం కూడా చేపట్టారు. ఈ ఫేస్‌బుక్ పేజీకి దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
 
 డైమండ్‌కి డార్క్..
 
 ముఖ్యంగా సిటీలో నిర్వహించే వజ్రాభరణాల ప్రదర్శనల్లో బ్లాక్ మోడల్స్‌కి తగినంత ప్రాధాన్యం లభిస్తోంది. తెలుపు కంటే నలుపు రంగుపై వజ్రం మరింతగా మెరుస్తూ ఆకట్టుకుంటుందని తేలడంతో బ్లాక్ బ్యూటీలకు డిమాండ్ పెరిగింది. కొన్ని రకాల బంగారు ఆభరణాలకు కూడా ప్రత్యేకంగా వీరిని ఎంచుకునే వారున్నారు. యాడ్స్ రంగంలోనూ బ్లాక్ కలర్‌కి ఇటీవలి కాలంలో మంచి గుర్తింపు లభిస్తోందని యాడ్ ఫొటోగ్రాఫర్ రాజేష్ చెప్పారు. లుక్స్, శరీరసౌష్టవం బాగుండి, చురుకుదనం, తెలివితేటలున్న అతివలు శరీర రంగుతో సంబంధం లేకుండా గ్లామర్ ప్రపంచంలో రాణించడం సాధ్యమేనన్నారు. ప్రస్తుత బ్లాక్ బ్యూటీల హవా శరీర రంగు కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితిని రూపుమాపుతుందని ఆశిద్దాం.
 
 కలర్... పవర్
 
 నేనెప్పుడూ నా శరీర రంగు విషయంలో చిన్నతనంగా భావించలేదు. అలా అనుకుంటే అసలు మోడలింగ్‌లోకి రాను కదా. నిజానికి ర్యాంప్‌కి డస్కీ మోడల్స్ కొత్త అందాన్ని తెస్తారు. కొందరు నల్లని అమ్మాయిల్ని తిరస్కరించవచ్చు కానీ... మా ప్రత్యేకత మాదే. ముఖ్యంగా జువెలరీ షూట్స్, ఆభరణాల ప్రదర్శనలకు డస్కీ మోడల్స్ చేసినంత న్యాయం మరెవరూ చేయలేరు. నా కెరీర్ ప్రారంభంతో పోలిస్తే... ఇప్పుడు డస్కీ కలర్‌కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఫ్యాషన్ డిజైనర్స్ మమ్మల్ని తప్పనిసరిగా వారి దుస్తుల ప్రదర్శనకు ఎంచుకుంటున్నారు. నల్లని రంగున్న అమ్మాయిలకు చెప్పేది ఒకటే... కలర్ కన్నా కాన్ఫిడెన్స్ ముఖ్యం.
 - డెబొరా డొరిస్, సిటీ మోడల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement