రహదారి భద్రతకు ప్రత్యేక వాహనాలు
రహదారి భద్రతకు ప్రత్యేక వాహనాలు
Published Thu, Mar 30 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
ఏలూరు అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 13 హైవే పెట్రోలింగ్ వాహనాలను అందించిందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని నివారించే లక్ష్యంతో ప్రభుత్వం బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)లు గుర్తించగా జిల్లాలో 39 బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయని చెప్పారు. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున జిల్లాలో ఎన్‌హెచ్–16కు సమీపంలోని 13 పోలీస్‌స్టేషన్లకు 13 వాహనాలు అందించారన్నారు. వాహనాల్లో వైర్‌లెస్, జీపీఆర్‌ఎస్ సిస్టమ్ ఉంటాయని, పెట్రోలింగ్ కోసం వాహనానికి ఏఎస్సై, హెచ్‌సీ, కానిస్టేబుల్‌ను కేటాయిస్తామని చెప్పారు. ప్రమాదాలు జరిగిన సమయంలో అంబులెన్స్ లు అందుబాటులో లేకుంటే బాధితులను పెట్రోలింగ్ వాహనాల్లో తరలిస్తారన్నారు. వాహనాలను ఏఆర్ డీఎస్పీ పర్యవేక్షిస్తారన్నారు.
కోడిపందేలపై దాడులు
పెదవేగి రూరల్: పెదవేగి మండలంలోని కోడిపందేల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయన్నపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని రెండు పందెంకోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొండలరావుపాలెం గ్రామంలో పందేల స్థావరంపై దాడి చేసి ఏడుగురి నుంచి రూ.3,300 నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Advertisement
Advertisement