క్రీడా ‘సంఘ’ర్షణ..!
-
ఆధిపత్యం కోసం ‘కొత్త’ క్రీడా సంఘాల ఆరాటం
కొత్తగూడెం–ఖమ్మం రెండు వేర్వేరు జిల్లాలు కానున్న నేపథ్యంలో క్రీడా సంఘాల బాధ్యతల కోసం ఆధిపత్య పోరు..మరింత జఠిలమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని క్రీడా సంఘాలు ఇష్టమొచ్చినట్లు బాధ్యతల కేటాయింపు ఇచ్చేస్తుండడం..ఒలింపిక్ అసోసియేషన్ గుర్తించకుండానే అనధికారికంగా కొనసాగుతుండడం..అయినా పట్టింపు కరువవడం సర్వసాధారణంగా మారింది. రెండు జిల్లాలోనూ తమకు అనుకూలంగా సంఘాలను కూడగట్టుకోవడంలో ఇప్పటికే పోటాపోటీ నెలకొంటోంది.
ఖమ్మం స్పోర్ట్స్:
జిల్లాలో 42 క్రీడా సంఘాలు రిజిస్ట్రేషన్ అయి ఉండగా..వీటిలో అనేక సంఘాలు ఒలింపిక్ అసోసియేషన్‌లో కానీ, స్పోర్ట్స్ అథారిటీలో కానీ గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగూడెం జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో స్పోర్ట్స్ అసోసియేషన్ వివరాలు ఇవ్వాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీ ఆదేశించడంతో..ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు క్రీడా సంఘాలు మాత్రమే వివరాలు ఇచ్చాయి. మిగతా సంఘాలు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీలో గుర్తింపు ఉంటేనే అఫిలియేషన్ వచ్చి..టోర్నీల నిర్వహణకు నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. క్రీడాకారులను కూడా ప్రోత్సహించుకునేందుకు అవకాశం లభిస్తుంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారులకు ఉపయోగం కలుగుతుంది. కానీ..కొత్తగా నమోదు చేసుకోకుండానే ఫలానా సంఘం బాధ్యులమంటూ కమిటీలు కొనసాగుతుండడం విశేషం. ఇప్పటి వరకు ఒక్కో క్రీడా సంఘానికి ఖమ్మంతో పాటు కొత్తగూడెం నుంచి కమిటీ బాధ్యుల ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉండేది. అటువైపు కొందరు, ఇటు వైపు నుంచి ఇంకొందరు ఎన్నికయ్యేవారు. ఈ సారి రెండు జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో..ఆయా జిల్లాల్లో వేర్వేరుగా పదవుల కోసం మళ్లీ స్థానికంగా గట్టిపోటీ ఎదురవనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అనుమతి ఇస్తేనే జిల్లాలో కొత్త క్రీడా సంఘాలు ఏర్పాటు చేసుకొవాల్సి ఉంటుంది. రెండు జిల్లాల్లోనూ క్రీడా సంఘాల బాధ్యులు తమకు అనుకూలంగా ఉండేలా కొందరు ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. భవిష్యత్‌లో ఒలింపిక్ అసోసియేషన్, ఇతర ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.