వాగు ఆక్రమణను తొలగించి చదును చేస్తున్న సిబ్బంది
-
మూడెకరాల చెరువు ముంపు ప్రాంత రక్షణకు చర్యలు
-
యుద్ధప్రతిపాదికన నడుస్తున్న పనులు
జగిత్యాల రూరల్ : జగిత్యాల మండలం మోతె ఊర చెరువు ప్రవాహం వచ్చే వాగు ఆక్రమణకు గురికాగా మిషన్ కాకతీయ ద్వారా మంజూరైన నిధులతో గోవిందుపల్లి వరకు ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం సబ్‌కలెక్టర్ ఆదేశాలతో గోవిందుపల్లి నుంచి నర్సింగాపూర్ వరకు పనులు ప్రారంభించారు. వాగుకు సంబంధించిన మూడెకరాల భూమి కబ్జా నుంచి వెలికి తీస్తుండడంతో సుమారు ప్రభుత్వానికి రూ.3 కోట్ల విలువైన భూమి స్వాధీనం కానుంది. మోతె ఊర చెరువుకు మిషన్ కాకతీయ పనుల్లో రూ.36.58 లక్షలు మంజూరయ్యాయి. కానీ మోతె ఊర చెరువుకు వచ్చే వాగును జగిత్యాల పట్టణ సమీపంలో ఉండడంతో కొంతమంది రియల్ ఎస్టేట్æవ్యాపారులు వాగు భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు. దీంతో ప్రధానంగా చెరువు ప్రవాహం వచ్చే వాగు కబ్జా చేయడంతో మోతె, లక్ష్మీపూర్, జాబితాపూర్, తిప్పన్నపేట, తిమ్మాపూర్, పొలాస గ్రామాల రైతులు సబ్‌కలెక్టర్ శశాంకకు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో సబ్‌కలెక్టర్ గతంలో మంజూరైన నిధులతో చిన్ననీటి పారుదలశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయించారు. గోవిందుపల్లి వరకు సుమారు మూడున్నర ఎకరాల ఆక్రమణలను తొలగించి వాగును చదును చేశారు. మిగతా గోవిందుపల్లి నుంచి నర్సింగాపూర్ వరకు మిగతా పనులను సబ్‌కలెక్టర్ ఆదేశాలతో తిరిగి ఆదివారం ప్రారంభించారు. దీంతో సుమారు మరో మూడెకరాల ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాగును చదును చేస్తున్నారు. దీంతో సుమారు ఇప్పటి వరకు రూ.5 కోట్ల విలువైన భూములను వెలికితీశారు. ఈ పూర్తి స్థాయి ఆక్రమణలను తొలగించి వాగును చదును చేస్తే వాగు నుంచి వచ్చే ప్రవాహంతో మోతె చెరువు, జాబితాపూర్‌లోని రెండు చెరువులు, లక్ష్మీపూర్‌లోని ఊర చెరువు, తిమ్మాపూర్‌లోని ఊర చెరువుకు, తిప్పన్నపేటలోని ముప్పాల చెరువు, పొలాసలోని ఊర చెరువులు పూర్తిస్తాయిలో నిండి రైతులకు వ్యవసాయ సాగుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఆక్రమణల తొలగింపు ఊపందుకోవడంతో పలుగ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.