ఫలించిన రెండేళ్ల పోరాటం | struggle succes | Sakshi
Sakshi News home page

ఫలించిన రెండేళ్ల పోరాటం

Published Fri, Aug 12 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

దేవళంపేట బడి

దేవళంపేట బడి

పలమనేరు: మండంలోని దేవళంపేట వాసులు రెండేళ్ల పోరాటం సాకారమైంది. అక్షరాభ్యాసం లేని గిరిజనం పిల్లలకు అక్షరజ్ఞానం లభించే అవకాశం కలిగింది. అడవిలోని తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరుతున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ గ్రామంలో బడి తెరవాలని స్థానిక ఎంఈవోకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేటి నుంచి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపి తరగతులు నిర్వహిస్తామని ఎంఈవో ఆగ్నెస్‌ తెలిపారు. 
పలమనేరు మండలం జగమర్ల పంచాయతీ దేవళంపేట గ్రామంలో 60 కుటుంబాలు ఉన్నాయి.

గ్రామానికి నాలుగువైపులా దట్టమైన అడవి ఉంది. ఈ గ్రామానికి దారిసౌకర్యం కూడా అంతంతమాత్రమే. అడవిలో లభించే ఫలసాయం, మేకల పెంపకంతోనే గిరిజనులు జీవిస్తున్నారు. 20 మంది విద్యార్థులు ఉన్న ఇక్కడి పాఠశాలకు టీచర్లు వెళ్లడం కష్టంగా ఉండడంతో అప్పటి ఎంఈవో వాసుదేవనాయడు ఓ విద్యా వలంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రెండేళ్ల క్రితం రేషనలైజేషన్‌లో ఈ పాఠశాలను రద్దు చేశారు. దీంతో గ్రామంలోని పిల్లలు చదువుకు దూరం అయ్యారు. కొందరు మాత్రం నాలుగు కిలోమీటర్ల దూరంలోని జగమర్ల పాఠశాలకు పిల్లలను పంపేవారు. అడవిలో ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో ఆపేశారు.  దీంతో గ్రామస్త్థులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలసి తమగోడు చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ బడిని వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement