
ఇక షుగర్ ఫ్రీ వరి!
* మధుమేహ రోగులు కడుపు నిండా భోజనం చేసే అవకాశం
* అందుబాటులోకి వచ్చిన నూతన వరి వంగడం
* సాగర్ ఆయకట్టులో సాగు చేసిన రైతులు
హుజూర్‌నగర్: మధుమేహ (షుగర్) వ్యాధి లక్షణాలు కనిపించగానే ప్రజలు భయపడిపోతారు. అన్నం తినాలన్న ఆశను చంపేసి నోరు కట్టేసుకొని మరీ కడుపు మాడ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. రెండు లేదా మూడు చిన్నపాటి రొట్టెలు, లేదా జొన్నగటక లాంటి పదార్థాలను తీసుకొని మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇక నుంచి మధుమేహ వ్యాధి గ్రస్తులు సైతం కడుపునిండా భోజనం చేసి హాయిగా ఉండవచ్చు. వీరిపాలిట వరంగా షుగర్ ఫ్రీ వరి వంగడం ఆర్‌ఎన్‌ఆర్ 15048 అందుబాటులోకి వచ్చింది. ఈ వంగడాన్ని నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టు పరిధిలో గత రబీ సీజన్ నుంచి కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు గాను హుజూర్‌నగర్ నియోజకవర్గంలో సుమారు రెండు వేల ఎకరాలలో రైతులు ఈ వంగడాన్ని సాగు చేపట్టారు. ఈ వంగడాన్ని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించి విడుదల చేసింది.
125 రోజుల్లో పంట చేతికి
ఈ వంగడం సన్నరకంగా ఉండి 120 నుంచి 125 రోజులలో పంట చేతికి అందివస్తుంది. అంతేగాక సన్నరకాలకు ప్రధానంగా వ్యాపించే దోమపోటు, అగ్గితెగుళ్లకు ఇది తట్టుకుంటుంది. దిగుబడుల పరంగా కూడా ఎకరాకు 40 నుంచి 45 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉండటం, పెట్టుబడులు సైతం భారీగా తగ్గుతుండటంతో రైతులకు మేలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన ఈ రకం వరి వంగడం కోతదశలోకి వచ్చింది. మరో వారం రోజుల్లో వరి కోతలు నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. సాధారణంగా రైతులు ఎక్కువగా సాగు చేసే బీపీటీ 5204 (సాంబమసూరి)కి అయ్యే ఖర్చులో 50 శాతం కూడా ఈ వరి సాగుకు ఉండటం లేదని పలువురు రైతులు తెలిపారు.
గ్లూకోజ్ శాతం తక్కువ..
ఈ వరి వంగడంలో ప్రధానమైన అంశం గ్లూకోజ్ శాతం చాలా తక్కువ ఉండడమే. కేవలం 50 శాతం వరకు మాత్రమే సుక్రోజ్ శాతం ఉంటుంది. బీపీటీ, ఇతర సాధారణ రకాల్లో 67 నుంచి 80 శాతం దాకా ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ వంగడం మంచి ఆహారమని చెప్పుకోవచ్చు. ఆర్‌ఎన్‌ఆర్ వంగడంపై జాతీయ పోషకాహార సంస్థలు సైతం వివిధ రకాల పరీక్షలు నిర్వహించగా ఈ విషయం రూఢీ అయినట్లు పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రకం వరి వంగడంపై రైతులకు మరింత అవగాహన కల్పించి సాగు చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు ధాన్యం విక్రయాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఆశాజనకంగా ఉంది
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కుగాను ఆర్‌ఎన్‌ఆర్ 15048 వరి వంగడాన్ని సాగు చేశాను. వారం రోజుల్లో కోతకు వస్తుంది. దీనికి సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. ప్రస్తుతం వరిపొలం ఆశాజనకంగా ఉండి దిగుబడి బాగానే వచ్చేలా కనిపిస్తుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టి రైతులకు మరింత అవగాహన కల్పించాలి.
- ములకలపల్లి సీతయ్య, రైతు, హుజూర్‌నగర్