- రేష¯ŒS కార్డుదారులకు చేదు కబురు
- ఇకపై పంచదార పంపిణీ అనుమానమే
- ఈ నెల కోటాలో అరకొర కేటాయింపులు
- ఒక్కొక్కటిగా సరుకులకు ఎసరు పెడుతున్న టీడీపీ సర్కారు
ఆగిన పంచ‘ధార’
Published Mon, May 1 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
కాకినాడ సిటీ :
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోగా రేష¯ŒS దుకాణాల్లో కార్డుదారులకు అందించే సరుకులకు ఎసరు పెడుతోంది. పేదల సంక్షేమమే లక్ష్యమని ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం రేష¯ŒS కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో సరైన విధానాన్ని అనుసరించడంలో ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి సబ్సిడీ ధరలలో పంపిణీ చేసేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, కిరోసిన్, పంచదార మినహా మిగిలినవాటికి ఈ మూడు సంవత్సరాల కాలంలో మంగళం పాడింది. ఇప్పుడు తాజాగా పంచదార విషంలోనూ చేతులెత్తేస్తోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తి వేయడంతో తమకేం సంబంధం లేనట్టుగా ఈ నెల కోటా విడుదల చేయకుండా పంచదార పంపిణీ నుంచి పక్కకు తప్పుకుంది. సబ్సిడీ కొనసాగించాలని కేంద్రానికి ఒక వినతిని పంపి ఊరుకుంది.
సుగర్ ఫ్యాక్టరీల నుంచి రాని సరుకు
ప్రతినెలా 20వ తేదీలోపు వివిధ సుగర్ ఫ్యాక్టరీల నుంచి జిల్లాలోని పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు పంచదార చేరుతుంది. మే నెల కోటాకు సంబంధించి ఏప్రిల్ 20లోపు పంచదార రావాల్సి ఉండగా మే ఒకటో తేదీ వచ్చినా ఇంకా స్టాకు రాలేదు. దీంతో జిల్లాలో గత నెల పంపిణీ చేయగా మిగిలి ఉన్న పంచదారను చౌక ధరల దుకాణాలకు అరకొర కేటాయింపులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో షాపులకు ముందుగా వెళ్లే కార్డుదారులకే పంచదార అందే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 64 మండలాల్లో ఉన్న 2,643 చౌకధరల దుకాణాల పరిధిలో తెలుపురంగు కార్డుదారులు, అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డులు 16,11494 ఉన్నాయి. ఈ కార్డుదారులకు ఒక్కొక్కరికి అరకిలో చొప్పున పంచదార పంపిణీ చేయాలంటే 805.862 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండాలి. కానీ గోదాములలో మాత్రం కేవలం 415 మెట్రిక్ టన్నులే ఉంది. దీంతో ఈ నెల(మే) కోటాలో పంపిణీ కోసం అరకొరగా రేష¯ŒS షాపులకు సర్దుబాటు చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని 50 శాతం షాపులకు పంచదార కేటాయించ లేదు. దీంతో సోమవారం ఆయా షాపులకు పంచదార కోసం వెళ్లిన కార్డుదారులకు నిరాశే ఎదురైంది. రేష¯ŒS దుకాణాల్లో ఇచ్చే అరకేజీ పంచదారæ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండల కేంద్రాల్లోనే పంపిణీ
కరప : బయట మార్కెట్లో కిలో పంచదార రూ.42 ఉంటే చౌకడిపోల ద్వారా రూ.13.50కు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెల నుంచి మండల కేంద్రాల్లోని వినియోగదారులకు తప్ప మిగిలిన గ్రామాల్లోని కార్డుదారులకు పంచదార కోటా రద్దు చేశారు. రేష¯ŒSషాపులకు వెళ్లిన వినియోగదారులకు పంచదార ఇవ్వడంలేదని డీలర్లు చెప్పడంతో గ్రామాల్లో ప్రజలు రిక్తహస్తాలతో తిరిగివస్తున్నారు. కోటాలో పంచదార ఇస్తుంటేనే బయట ధర పెంచేస్తున్నారని, మొత్తానికి పంచదార కోటా ఎత్తేస్తే మరింతగా పెరిగిపోతుందని, ఇక నుంచి కాఫీ, టీలు తాగలేమని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో గులాబీరంగు కార్డుదారులకు 2 కిలోలు, తెలుపురంగు కార్డుదారులకు ఒక కిలో వంతున పంచదార పంపిణీ చేసేవారు. కొన్నాళ్లకు గులాబీరంగు కార్డుదారులకు నిలిపివేసి, తెలుపురంగు కార్డుదారులకు అరకిలో వంతున ఇస్తున్నారు. ఈ నెల నుంచి మండల కేంద్రంలోని తెలుపురంగు రేష¯ŒSకార్డుదారులకు యథావిధిగా పంచదార ఇస్తూ, గ్రామీణ ప్రాంతాలవారికి కోటా రద్దు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
స్టాకు ఉన్నంత వరకు
కేటాయింపులు
జిల్లాలో పంచదార స్టాకు ఉన్నంత వరకు చౌక దుకాణాలకు కేటాయించాం. రంపచోడవరం, పెద్దాపురం డివిజన్లలో అన్ని షాపులకు పూర్తిగానూ, కార్పొరేష¯ŒSలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో 90 శాతం కేటాయించాం. ఈ నెల కోటా రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మిగిలినవారికి పంపిణీ చేస్తాం.
– వి.రవికిరణ్, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి
Advertisement
Advertisement