స్వర్ణ మండపం.. శోభాయమానం
స్వర్ణ మండపం.. శోభాయమానం
Published Thu, Sep 15 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
మంత్రాలయం: వేద మంత్రోచ్ఛారణ.. భక్తుల హర్షధ్వానాలు.. శాస్త్రోక్త పూజల మధ్య స్వర్ణమండప ప్రారంభోత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు విరాళంగా అందజేసిన రూ.18 కోట్ల విలువ చేసే దాదాపు 60 కేజీల బంగారంతో ఆరు నెలల పాటు శ్రమించి ఈ మండపాన్ని రూపొందించారు. స్వామికి ప్రీతిపాత్రమైన గురువారం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శాస్త్రోక్తంగా మండపాన్ని ప్రారంభించారు. మూలరాముల పేటిక, న్యాయసుధా పరిమళ గ్రంథాన్ని మండపంలో ఉంచి విశేష పూజలు నిర్వహించారు. అంతకు ముందు రాఘవేంద్ర స్వామి మూల బందావనానికి నైవేద్య సమర్పణ.. అభిషేకం చేపట్టారు. స్వామి బందావన ప్రతిమను స్వర్ణ పల్లకీలో కొలువుంచి శ్రీమఠం మాడవీధుల్లో కనుల పండువగా ఊరేగించారు. పూజా మందిరంలోని స్వర్ణ మండపంలో మూల, జయ, దిగ్విజయ రాములను అధిష్టించారు. పీఠాధిపతి మాట్లాడుతూ రాఘవేంద్రుల కరుణా కటాక్షంతో శ్రీమఠం ఖ్యాతి రోజురోజుకూ విస్తరిస్తోందన్నారు. నంజన్‌గూడ, శ్రీమఠం భక్తుల కానుకలతో స్వర్ణ మండపం రూపుదిద్దుకుందన్నారు. వేడుకల్లో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసారాజాచార్, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.
Advertisement