దే...వుడా..!
దే...వుడా..!
Published Wed, Jul 27 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
దేవుడికి పూజ చేయించాలా..ప్రసాదం భక్తులకు పంచి పెట్టాలా.. దేవుడికి అలంకరణ చేయాలా..ఉత్సవాలు చేయాలా..అయితే మా వాళ్లతో మాట్లాడండి.. వాళ్లకు చెప్పా పెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకోకండి..
జిల్లాలోని పలువురు దేవస్థానాల కార్యనిర్వహణాధికారుల(ఈవో)కు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జారీ చేసిన హుకుం ఇది. తమపై అజమాయిషీ చేసే అధికారం అసలు ఎమ్మెల్యేలకు ఉందా? రాజ్యాంగంలో అలాగని ఎక్కడా పొందుపరచలేదే! అయినా ఆదేశాల కొరడా ఝుళిపిస్తున్నారెందుకని ఈవోలు రగిలిపోతున్నారు.
దీనిపై బయటపడే ధైర్యం చేయలేక.. తెలుగు తమ్ముళ్ల పెత్తనాన్ని భరించలేక.. ఈవోలు ‘అడకత్తెరలో పోక చెక్కల్లా’ నలిగిపోతున్నారు. కొన్ని ఆలయాల్లోనైతే ‘తమ్ముళ్లు’ బరితెగించి ఈవోల కుర్చీలను ఆక్రమించి మరీ వారిపై స్వారీ చేస్తు్తన్నారు. కళ్లెదుటే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేకపోతున్నామని ఈవోలు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. పార్టీ నియోజకవర్గ పెద్దలు.. ఎన్నికలప్పుడు ద్వితీయ శ్రేణి నేతలకు పదవుల ఆశలు కల్పించి వెంట తిప్పుకుని ఎమ్మెల్యేలైపోయారు. తీరా చూస్తే జెండా మోసినవారికి పదవులు ఇవ్వలేని పరిస్థితి. అలాగని ఊరకనే వెంట తిరగరనే ఉద్దేశంతో.. పలు ఆలయాలకు తెలుగు తమ్ముళ్లను అనధికారిక చైర్మన్‌లుగా ఎమ్మెల్యేలే నియమించేశారు. ఇదే అవకాశంగా.. తమ్ముళ్లు ఈవోలను లెక్క చేయకుండా అన్నీ తామే అన్నట్టు ఆలయాలపై పెత్తనం చెలాయిస్తున్నారు.
జిల్లాలో వివిధ కేటగిరీల్లో సుమారు వెయ్యి దేవాలయాలున్నాయి. గడచిన రెండున్నరేళ్లలో 200 ఆలయాలకు మాత్రమే చైర్మన్లతో కూడిన కమిటీలు వేశారు. తక్కువ ఆదాయం వచ్చే 200 ఆలయాల నిర్వహణ బాధ్యతలను అర్చకులకే అప్పగించారు. మిగిలిన 600 ఆలయాలకు అధికారికంగా చైర్మన్ల నియామకం జరపలేదు. ఆయా ఆలయాలపై పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు పెత్తనం అప్పగించారు. దీంతో అనధికార చైర్మన్లుగా వారు అందినంతా దోచుకుంటున్నారు.
చివరకు దేవుడికి నిత్యం జరగాల్సిన ధూపదీప నైవేద్యాలకు ఇవ్వాల్సిన పడితరంలో కూడా వాటాలు గుంజుతున్నారు. గతంలో ఏడాదికి అవసరమైన పడితరాన్ని ఒక నెల ముందుగానే ఈవోలు విడుదల చేసేవారు. ఆలయ ఆదాయాన్నిబట్టి ఈ పడితరం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంటుంది. కొద్ది నెలలుగా పడితరం విడుదల చేయకుండా ఈవోలపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా పలు ఆలయాల్లో ఐదారు నెలలుగా పడితరం బిల్లులు ఇవ్వడం లేదు.
ఉదాహరణలెన్నో..
∙తుని సమీపాన తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతూంటాయి. రెండేళ్లుగా ఈ దేవస్థానానికి చైర్మన్ నియామకం జరగలేదు. మంత్రి యనమల రామకృష్ణుడు అనుచరుడైన తుని సమీపాన చామవరానికి చెందిన ఒక తెలుగు తమ్ముడు దేవస్థానం కార్యకలాపాల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. తనను త్వరలో చైర్మన్‌గా నియమిస్తారని, అన్నీ తాను చెప్పినట్టే నడవాలని అంటూ ఆలయ అధికారులను రాచిరంపాన పెడుతున్నాడు. బంధువులు, తమ నేతలు వస్తే ఆ ఖర్చులన్నీ అధికారులే భరించాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. హుండీ లెక్కింపు నుంచి కొంత పక్కకు తీయాల్సిందేనని పట్టుబట్టి మరీ గుంజుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
∙పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ నియామకం కూడా ఇంకా జరగలేదు. అక్కడ పెత్తనమంతా ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు ముఖ్య అనుచరుడైన దేవస్థానం ఒకప్పటి మాజీ చైర్మన్‌దే. ఈ ఆలయంలో ఏడాదికి రూ.కోటిన్నరకు పైగానే ఆదాయం వస్తుంది. రోజూ ఆలయంలోనే మకాం వేసి అన్నీ తానై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారు చెప్పినట్టు వినకుంటే ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి బెదిరింపులకు దిగుతున్నారు.
∙కాకినాడ బాలత్రిపురసుందరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి కూడా చైర్మన్ నియామకం జరగలేదు. ఇక్కడ కూడా తలుపులమ్మ దేవస్థానంలో మాదిరి తంతే నడుస్తోంది. టీడీపీ వాణిజ్య విభాగానికి చెందిన ఒక ముఖ్య నేత ఆలయ అనధికారిక చైర్మన్‌గా చలామణీ అవుతున్నారు. అయితే ఇక్కడ ఆ ముఖ్యనేత కంటే అతని అనుచరగణం హవానే ఎక్కువగా నడుస్తోంది. ఆలయ పర్వదినాల్లో తెలుగు తమ్ముళ్లే పెత్తనం చెలాయిస్తున్నారు.
∙కాకినాడ జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జగన్నాథపురానికి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అనుచరుడు చైర్మన్ కాని చైర్మన్‌గా హల్‌చల్ చేస్తున్నాడు. తమపై అతడి వేధింపులు మితిమీరిపోతున్నాయని ఆలయ ఉద్యోగులు వాపోతున్నారు. హుండీ లెక్కించారంటే చాలు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఆ ‘తమ్ముడి’ చేతిలో పెట్టాల్సిందే. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవంటూ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నాడు.
∙కాకినాడ భానులింగేశ్వరస్వామి దేవస్థానంలో కూడా దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఇక్కడ స్థానిక టీడీపీ నాయకుడొకరు ఉద్యోగుల కార్యకలాపాల్లో తలదూరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
∙కోనసీమ కేంద్రం అమలాపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు ఏడాదిపాటు అనధికారికంగా పెత్తనం చెలాయించారు. సుబ్బాలమ్మ దేవస్థానం ఈవోగా ఉన్న సీహెచ్ లక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఇన్‌చార్జిగా పని చేశారు. నిజాయితీగా పని చేస్తూ సుబ్బాలమ్మ దేవస్థానానికి చెందిన భూములు, కౌలు ఎగవేతదారులపై ఆమె కొరడా ఝుళిపించారు. అటువంటి ఈవో ఇన్‌చార్జిగా కొనసాగితే తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో ఆమెను మంత్రి సిఫారసుతో బదిలీ చేయించేశారు.
Advertisement