తొలగిన'తల’భారం
అన్నవరం దేవస్థానంలో నిల్వ ఉన్న 700 కిలోల తలనీలాలు
వేలంపాట దారునికి అప్పగించేందుకు కమిషనర్ అనుమతి
రూ.20 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం
అన్నవరం(ప్రత్తిపాడు) : దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఓ ఆదేశం అన్నవరం దేవస్థానం అధికారుల తల బరువు దించినట్టయింది. దేవస్థానంలోని కేశఖండన శాలలో గత తొమ్మిది నెలలుగా నిల్వ ఉన్న సుమారు 700 కేజీల తలనీలాలను పాటదారునికి అప్పగించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ అనుమతి మంజూరు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాలను తీసుకునేందుకు ఏటా వేలం పాట నిర్వహిస్తారు. గతేడాది కూడా ఇదే విధంగా వేలంపాట నిర్వహించగా రూ.1.28 కోట్లకు పాట వెళ్లింది. అయితే పాటదారుడు రూ.పది లక్షలు మాత్రమే చెల్లించడంతో ఆ విలువ మేరకు తల నీలాలను అప్పగించారు. నవంబర్ 17 నుంచి వచ్చిన తల నీలాలను కేశఖండనశాలలోని గదిలో దేవస్థానం అధికారులు భద్రపరుస్తున్నారు. అయితే తల నీలాలు మూడు నెలలు వరకూ మాత్రమే భద్రపర్చడానికి వీలు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రోజులు భద్రపర్చాలంటే కెమికల్స్‌తో ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏర్పాటు దేవస్థానంలో లేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వేలం నిర్వహించారు. తల పొడవును బట్టి గ్రేడ్‌ల వారీగా విభజించి పాట నిర్వహించారు. ఇందులో అత్యధికంగా రూ.20 లక్షల వరకూ పాట వెళ్లింది. ఈ వేలం పాట ను పాలకమండలి కూడా ఖరారు చేయడంతో కమిషనర్ అనుమతికి పంపించారు. తలనీలాలను పాట దారునికి అందచేయడానికి కమిషనర్ మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తలనీలాలను పాటదారునికి అప్పగిస్తామని ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు తెలిపారు.