
కొత్త సంసారంలా ఉంది:రోశయ్య
తాడేపల్లిగూడెం: కోస్తా జిల్లాల వారికి చైతన్యం ఎక్కువని, ఆ కారణంతోనే అన్ని రాజకీయ పార్టీల దృష్టీ ఇటువైపే ఉంటుందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. శనివారం ఉదయం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేకర్లతో మాట్లాడారు. ఇక్కడి వారి ఆదరణ, అభిమానం పొందేందుకు పార్టీలు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు. అయితే, ఇది మోతాదు మించకుండా చూసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్నోమార్పులు సంభవించాయన్నారు. కొత్త సంసారం మాదిరిగా ఎక్కడికక్కడ సర్దుబాట్లు జరుగుతున్నాయని, త్వరలోనే అన్నీ చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరారు.