అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో.. | tdp | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో..

Published Tue, Sep 13 2016 12:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో.. - Sakshi

అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో..

  • రూ.10 కోట్ల విలువైన భూమిపై టీడీపీ నేతల కన్ను
  • దశాబ్దాలుగా ఉన్న ‘ఉర్దూ’ కార్యాలయం నేలమట్టం
  • భవన నిర్మాణ కాంట్రాక్టు అప్పగింత
  • వాటిలో షాపింగ్‌ కాంప్లెక్సులకు వ్యూహం
  • ప్రతినెలా అద్దెల రూపంలో లక్షల స్వాహాకు ఎత్తుగడ
  • ఆందోళనలకు సిద్ధమవుతున్న మైనార్టీలు
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    అది కాకినాడ నగరానికి నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం. అక్కడ గజం స్థలం కొనాలంటే రెండు లక్షలుపైనే పెట్టాలి. ఇప్పుడున్న ధరలతో లెక్కిస్తే రూ.10 కోట్లు విలువ చేస్తుంది. అటువంటి ప్రాంతం లో 500 గజాల స్థలంలో రెండు దశాబ్థాలుగా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఉర్దూ స్కూల్స్‌ కార్యాలయం నడుస్తోంది. ఆ స్థలం తమకు వృత్తి విద్యా కళాశాల కోసం కావాలంటూ పిఠాపురం రాజా (పీఆర్‌) కళాశాల యాజమాన్యం పట్టుబట్టి స్కూల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఆఫ్‌ ఉర్దూ కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. బయటకు ఆ కళాశాల యాజమాన్యం కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక కాకినాడ నగరంలోని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత, అతని అనుచరులు తెరవెనుక పావులు కదిపారు. ‘మహోప్రభో ఆదుకోండ’ంటూ కాకినాడ సిటీ ఎమెమల్యే వనమాడి కొండబాబు దగ్గరకు ముస్లింలు పరుగులు తీశారు. ‘మహారాజా ... అంటే మరి రెండు తన్నమన్నట్టు’గా మౌనం వహించడంతో తెలుగు తమ్ముళ్లు తమ పని తాము చక్కబెట్టుకున్నారు. అధికార బలానిదే పై చేయి కావడంతో ఉర్దూ కార్యాలయం నేటమట్టమయింది. అయినదే తడువుగా రూ.34.50 లక్షలు ఎస్‌ఆర్‌ఎంటీ నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్స్‌బులిటీ ఫండ్‌ను కూడా మంజూరు చేయించేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ఉర్థూ కార్యాలయం కాకినాడలోనే ఉంది. ఖాళీగా ఉన్న మిగిలిన స్థలంలో ఉర్థూ అకాడమీ ప్రాంతీయ కార్యాలయం, మైనార్టీ కార్పొరేషన్, వక్స్‌S్ఫబోర్డు ఇలా...ఒకే కాంప్లెక్స్‌లో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటి నుంచో డైరెక్టర్‌ ఆఫ్‌ మైనార్టీస్‌కు వెళ్లిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిమాట ‘అల్లా’ ఎరుగు ఉన్న గూడు కూడా పోవడంతో మైనార్టీలు లబోదిబోమంటున్నారు. ఈ గోడు మధ్యనే ఆ భవనాల నిర్మాణ కాంట్రాక్టును అధికారపార్టీ నేతలే హస్తగతం చేసుకున్నారు. చుట్టా తెరచాపలు చుట్టేసి పనులు కూడా ప్రారంభించేశారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఓ వర్గం ఆగ్రహంతో ఉంది.  
    ఆ ముఖ్యనేత వ్యూహమిదీ...
    ఆ 500 గజాల్లో నిర్మించే భవనంలో తొలుత వృత్తి విద్యా కోర్సులకు రెండు గదులు నిర్మిస్తారు. ఇందుకు ఎస్‌ఆర్‌ఎంటీ సమకూర్చిన రూ.34.50 లక్షలు వెచ్చిస్తారు. ఇదంతా పక్కాగానే జరిగిపోతోంది. అసలు కిటుకు రెండో దశలోనే ఉంది. రెండో దశలో మెయిన్‌రోడ్డు వైపు  షాపింగ్‌ కాంప్లెక్సు ఏర్పాటుచేసి సగం దుకాణాలు ఆ ముఖ్యనేత చెప్పిన వారికి కట్టబెట్టే ‘డీల్‌’ కుదిరిందని సమాచారం. ఆ స్థలం ఉన్న ప్రాంతం మెయిన్‌ రోడ్డులో అతి ప్రధానమైన కూడలిలో ఉండటంతో దుకాణాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఒక షాపునకు అడ్వాన్సుగా రూ.50 లక్షలు పైనే వస్తుంది. అలా మెయిన్‌ రోడ్డువైపు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వచ్చే నాలుగు దుకాణాలపైనా రెండు కోట్లు అడ్వాన్సుగా నొక్కేయవచ్చని ఆ ముఖ్యనేత వ్యూహంగా కనిపిస్తోంది. పీఆర్‌ కాలేజీ స్థలంలో ముఖ్యనేతకు ఎలా దుకాణాలు కేటాయిస్తారనుకుంటున్నారా...? రెండో దశలో దుకాణాలు నిర్మాణం పూర్తయ్యాక నామమాత్రపు అద్దెకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి భారీగా అడ్వాన్సులు, అద్దెలు ఆ ముఖ్యనేతకు చేరేలా తెరవెనుక పావులుకదుపుతున్నారు. అందుకే ఆ ప్రజాప్రతినిధి అనచరుడు  రెండు దశాబ్థాలుగా ఉంటున్న తమ కార్యాలయాన్ని ఉన్నఫళంగా ఖాళీ చేయించి భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహం పక్కాగా భవిష్యత్తులో అమలు పరిచేందుకే రూ.34.50 లక్షలతో చేపట్టే భవన నిర్మాణాన్ని ఆ ముఖ్యనేత తన ప్రధాన అనుచరుడికి కట్టబెట్టేశారు. అతనేమైనా కాంట్రాక్టరా అంటే చిన్న వీధి కాలువ నిర్మించిన అనుభవం కూడా లేదు.  నిర్మాణ దశ నుంచి తమ ఆధిపత్యం ఉంటేనే మెయిన్‌ రోడ్డువైపు దుకాణాల్లో కూడా చక్రం తిప్పవచ్చేనేది  వారి వ్యూహం. దీనిపై ముస్లిం పెద్దలు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నాక భవిష్యత్‌ కార్యచరణ నిర్ణయిస్తామంటున్నారు.         
     
     
     
    అపోహ మాత్రమే...
    పీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఒకేషనల్‌ కళాశాల కోసం నిర్మిస్తున్న భవనంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌కు అనుమతి ఇస్తున్నామనేది పూర్తిగా అపోహ మాత్రమే. విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో ఎస్‌ఆర్‌ఎంటీ సంస్థను సంప్రదించగా సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ పథకంలో భాగంగా రెండు తరగతి గదులు, ఒక హాలు నిర్మాణానికి 34 లక్షల 50 వేల రూపాయలును నిధులు అందజేశారు. త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేస్తాం           – వి.కేశవరావు, పీఆర్‌ ఒకేషనల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌
     
     
    త్వరలో కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తా..
    ఎన్నో ఏళ్ళుగా ఉన్న భవనం స్థానంలో యథావిధిగా కార్యాలయాన్ని నిర్మించాలి. ఈ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని త్వరలోనే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం, యథాతథంగా అక్కడ కార్యాలయాన్ని నిర్మించాల్సిందిగా కోరతాం. అందుకు విరుద్ధంగా జరిగితే పోరాడేందుకు సిద్ధం.– అబ్దుల్‌ బషీరుద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement