ఫ్రిజ్ ఉంటే.. ఇల్లు ఫట్
♦ ద్విచక్ర వాహనం ఉన్నా కొత్త గృహం రాదు
♦ కేంద్రం ఆదేశాలను రాష్ట్రానికి వర్తింపజేసేందుకు టీడీపీ ప్రభుత్వ యత్నం
♦ మంజూరుకు నిబంధనలు విధించిన పాలకులు
ప్రొద్దుటూరు : ద్విచక్ర వాహనమే కాదు ఫ్రిజ్ ఉన్నా కూడా ప్రభుత్వ గృహాలు మంజూరయ్యే పరిస్థితి లేదు. ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఇందిరా ఆవాస్ యోజన పథకానికి మోదీ ప్రభుత్వం ఈ పేరు మార్చింది. దీనినే హౌసింగ్ ఫర్ ఆల్ అని కూడా పిలుస్తున్నారు. తొలి విడతగా ఇందుకు సంబంధించి జాతీయ స్థాయిలో వంద పట్టణాలను ఎంపిక చేయగా జిల్లాలో కడప, ప్రొద్దుటూరు ఉన్నాయి. ఇందులో మొత్తం 15 రకాల నిబంధనలను విధించారు. ఈ ప్రకారం 2, 3, 4 చక్రాల వాహనాలు, ఫ్రిజ్, నెలకు రూ.10 వేల ఆదాయం మించి ఉన్న వారు, ఆదాయ పన్ను చెల్లించు వారు, ఉద్యోగ, వృత్తి పన్ను చెల్లించు వారు, సొంత ల్యాండ్‌లైన్ ఫోన్ కలిగి ఉన్న వారు ఈ పథకానికి అనర్హులని పేర్కొన్నారు.
సొంత (పక్కా/ఆర్డీటీ) ఇల్లు ఉన్నా, వ్యవసాయానికి సంబంధించిన 3 లేదా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నా, రూ.50 వేలకు మించి కిసాన్ క్రిడెట్ కార్డు ఉన్నా, ప్రభుత్వం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నా, తడి భూమి రెండున్నర ఎకరాలు మించి ఉన్నా, ఐదెకరాలు ఉండి రెండు పంటలు మించి పండిస్తున్నా, బోర్లతో 7.5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఇంటికి నెలకు రూ.500 మించి కరెంటు బిల్లు చెల్లిస్తున్నా వారు ఇంటికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ హౌసింగ్‌కు అమలు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు కాలేదు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక పలుకుబడి ఉన్న టీడీపీ తమ్ముళ్లకు ఇళ్ల మరమ్మతుల కోసం.. గృహానికి రూ.10 వేలు చొప్పున మంజూరు చేయడం జరిగిందే తప్ప, ఏ ఒక్కరికీ కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదు. ఇదిలా వుండగా అమృత్ పథకం కింద జిల్లాలో కడప కార్పొరేషన్‌కు 2 వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 2 వేలు చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1250 చొప్పున ఇళ్లు మంజూరు చేయగా.. ప్రొద్దుటూరు, కడప రూరల్ ప్రాంతాలకు మాత్రం 500 చొప్పున ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇళ్లు మంజూరైనా ఇంకా లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగలేదు. తాజాగా ప్రధాని ఆవాస యోజన పథకానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి కూడా ఇవే నిబంధనలను అమలు చేయనుంది. ఈ నెల 5న జరిగిన ప్రొద్దుటూరు మండల సర్వసభ్య సమావేశంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు ఈ నిబంధనలను చదివి వినిపించగా.. ఈ ప్రకారం ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదని మండల ఉపాధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
త్వరలో గ్రామ సభలు
ఈనెల 15 నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కష్టతరంగా మారే అవకాశం ఉంది.