నేనే రారాజునంటే కుదరదు | TDP incharge Kandula Narayana Reddy | Sakshi
Sakshi News home page

నేనే రారాజునంటే కుదరదు

Published Mon, Jun 20 2016 8:56 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP incharge Kandula Narayana Reddy

మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గానికి తానే రారాజునంటూ టీడీపీ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి కాశీనాథ్, శాసనాల వీరబ్రహ్మం హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న ఇమ్మడి కాశీనాథ్ స్వగృహంలో మార్కాపురం, తర్లుపాడు టీడీపీ నేతలతో కలిసి వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి శనివారం సాయంత్రం తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు.

తాము పార్టీ ఆవిర్భావం నుంచి విధేయులైన కార్యకర్తలుగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. మిగిలిన నేతల్తా పార్టీని అడ్డు పెట్టుకుని అవినీతి పనులు, కాంట్రాక్టులు, పర్సంటేజీలు తీసుకోవడం లేదన్నారు. కందుల నారాయణరెడ్డికి పార్టీ అవసరమని, నిజాయితీగా ఉన్న తమను సస్పెండ్ చేసే అధికారం ఆయనకు లేదన్నారు. ఇప్పటికే ఆయన అవినీతి పనుల వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఉన్నాయని, రెండు నెలల్లోనే మార్కాపురం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారని కాశీనాథ్, వీరబ్రహ్మం చెప్పారు.

అవసరమైతే చంద్రబాబు వద్ద పంచాయితీ పెడతామని హెచ్చరించారు. కందుల వ్యవహారం మంత్రులు శిద్దా రాఘవరావు, రావెల కిశోర్‌బాబు, కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లకు తెలుసన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా మార్కాపురంలో పార్టీ కార్యాలయం లేదని, దోర్నాల బస్టాండ్‌లో మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఇంత వరకు ముసుగు తీయకపోవటం శోచనీయమన్నారు. వీటిని ప్రశ్నిస్తే తమకు అసమ్మతి నేతలుగా ముద్ర వేయడం పద్ధతి కాదన్నారు.

2014 ఎన్నికల్లో పార్టీ మారేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నందునే ఆయన ఇప్పుడు టీడీపీ ఇన్‌చార్జి పదవిలో ఉన్నాడని గుర్తు చేశారు. ఇన్‌చార్జి వైఖరితో నియోజకవర్గంలోని తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నారు. కందుల మాట విన్న అధికారులు ఉద్యోగాలు కాపాడుకోవాలని సూచించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాము అనేక విషయాలు బయట పెట్టలేకపోతున్నామని చెప్పారు.

సమావేశంలో తర్లుపాడు సర్పంచి కందుల విజయ కళావతి, కలుజువ్వలపాడు ఎంపీటీసీ సభ్యుడు సాదుల వీరయ్య, తర్లుపాడు కో ఆప్షన్ సభ్యుడు షేక్ నన్నెసాహెబ్, మాజీ అధ్యక్షుడు నరసింహారావు, నాగులవరం వైస్ ప్రెసిడెంట్ మూల వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు సండ్రపాటి ప్రసాద్, షరీఫ్, తిరుమలశెట్టి వీరయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement