ఉద్యోగం ఇప్పిస్తానని టీడీపీ నేత టోకరా
అమలాపురం టౌన్: కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ యువతి వద్ద రూ.లక్షల్లో సొమ్ములు కాజేసిన అయినవిల్లి మండలం టీడీపీ నాయకుడు, ఆ మండల జెడ్పీటీసీ సభ్యురాలి భర్త గంగుమళ్ల శ్రీనివాసరావుతోపాటు మరో అయిదుగురిపై కేసు నమోదైంది. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లికి చెందిన ఆ యువతికి టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుతోపాటు అదే గ్రామానికి చెందిన మూసాబత్తుల వెంకటేశ్వరరావు, లైన్‌మెన్ అంజిబాబు, మంగం సత్యనారాయణ, సుప్రీమ్, నరేష్‌లు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని ఆమె వద్ద నుంచి మొత్తం రూ.3.70 లక్షలు కాజేసినట్లు ఆ యువతి అమలాపురం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌కు బాధితురాలి తండ్రి, ఐద్వా నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.
టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుకు చెందిన బ్యాంక్ అకౌంట్‌లో ఆ యువతి రూ.2.60 లక్షలు నగదు ఆమె డిపాజిట్ చేశారు, తరువాత శ్రీనివాసరావు అనుచరులైన అయిదుగురు దఫాదఫాలుగా ఆమె నుంచి రూ.1.10 లక్షలు తీసుకుని మొత్తం రూ.3.70 లక్షలు తీసుకున్నట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు తాండవపల్లికి చెందిన అయిదుగురు వ్యక్తులు అమలాపురం బైపాస్ రోడ్డుకు రమ్మని నమ్మించి కారులో బలవంతంగా కిడ్నాపు చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారని, డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఏపీ 37 బీవీ 3787 నెంబరు గల తెలుపు కారులో సాయంత్రం ఆరు గంటల వరకూ తిప్పి చల్లపల్లి దారిలో వదిలేసి వెళ్లిపోయారని పేర్కొంది. తన ఫోన్‌లో సిమ్ కూడా లాక్కుని వదిలేశారని చెప్పింది. బ్యాంకులో రూ.2.60 లక్షలు వేసినట్లుగా ఉన్న బ్యాంక్ ఓచర్లు, కౌంటర్ ఫైల్‌ను యువతి తన ఫిర్యాదు పత్రంలో జత చేశారు.
కేసు నమోదు... : ఆ వ్యక్తులపై కిడ్నాపు, బెదిరింపు, చీటింగ్, అసభ్యకర ప్రవర్తన కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. జిల్లా ఐద్వా కార్యదర్శి సీహెచ్.రమణి బాధిత యువతికి అండగా నిలిచి దగ్గురుండి పోలీసులకు ఫిర్యాదు చేయించారు.