‘తమ్ముళ్ల’ ఘర్షణ
⇒ విరిగిన కుర్చీలు, టేబుళ్లు
⇒ ‘దేశం’ రాష్ట్ర పరిశీలకుని ఎదుట తోపులాట
⇒ నియోజకవర్గ సమావేశంలో బయటపడిన విభేదాలు
రామకృష్ణాపూర్ : చెన్నూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వ డం లేదంటూ ఇద్దరు ముఖ్య నాయకులు అనుచరులు ఘర్షణపడ్డారు. రాష్ట్ర పార్టీ పరిశీలకుని ఎదుటే ఒకరిపైనొకరు కుర్చీలు విసురుకున్నారు. టేబుళ్లు విరగ్గొట్టారు. ఇందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన చెన్నూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వేదికైంది. సమావేశం ప్రారంభమైన అనంతరం మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు తాజుద్దీన్, ఇతర ముఖ్య నాయకులు మాట్లాడారు.
కొంతకాలంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దుర్గం నరేశ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బి.సంజయ్‌కుమార్ అనుచరులు పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదంటూ గొడవకు దిగారు. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పెద్దగా అరుస్తూ ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. అసలే నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో ఈ తమ్ముళ్ల తగువులాట కార్యకర్తలను అసంతృప్తి గురి చేసింది. దీంతో కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ ప్రధాన నాయకులు ఎవరు కూడా గొడవను నివారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
– మాజీ మంత్రి బోడ జనార్దన్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యకర్తలు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర పరిశీలకుడు తాజొద్దీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని అన్నారు.
కాగా పట్టణానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ శరత్‌కుమార్, చెన్నూర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దుర్గం నరేశ్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బి.సంజయ్‌కుమార్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు గోపు రాజం, నక్క శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, తిరుపతి, బుచ్చన్న, రుక్మిణి, లలిత, సాగర్ తదితరులు పాల్గొన్నారు.