టీడీపీ నాయకులకు చుక్కెదురు
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నిలదీసిన ప్రజలు
తొండూరు : ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులకు చుక్కెదురైంది. బుధవారం మండలంలోని గంగనపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులోభాగంగా పోతలపల్లెలో ఇంటింటికి టీడీపీలో పాల్గొన్న సతీష్‌రెడ్డిని ప్రజలు నిలదీశారు. బాబు ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందని చెప్పగా.. ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రుణమాఫీ కాలేదని, తాగునీరు లేదని, బస్సు సౌకర్యం లేదని సతీష్‌రెడ్డిని నిలదీశారు. అక్కడి నుంచి ఆయన ప్రజలకు సమాధానం చెప్పకుండా మెల్లగా జారుకున్నారు.
అనంతరం టీడీపీ మండల నాయకుడు శివమోహన్‌రెడ్డి గంగాదేవిపల్లె చేరుకుని తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా, అక్కడి రైతులు, ప్రజలు శివమోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. రుణమాఫీ చాలామందికి కాకుండానే అయిందంటూ గొప్పలు చెబుతున్నారని, అలాగే ఇనగలూరు వద్దనున్న రాజుసేతుసాగర్ నుంచి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను పట్టించుకున్నావా? అంటూ నిలదీశారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే తొండూరు ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.