టీడీపీ మైండ్‌గేమ్ | TDP Mind Game | Sakshi
Sakshi News home page

టీడీపీ మైండ్‌గేమ్

Published Thu, Feb 11 2016 11:54 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

టీడీపీ మైండ్‌గేమ్ - Sakshi

టీడీపీ మైండ్‌గేమ్

 చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలి
  హైదరాబాద్ ఎన్నికలు గుణపాఠం నేర్పాలి
  టీఆర్‌ఎస్‌కి నేతల వలసతో ఆందోళన
 అందులో భాగమే ‘బురద’ ప్లాన్
   వైఎస్సార్‌సీపీని వీడేది లేదని  ఎమ్మెల్యేలు  కలమట, క ళావతి, కంబాల స్పష్టీకరణ

  టౌన్‌హాల్ అభివృద్ధి కోసమే  వైఎస్సార్‌సీపీకి అద్దెకిచ్చాం
 ఇది ఎవరి సొత్తూ కాదు. ట్రస్ట్ భూమి అని ఏనాడో చెప్పా
  వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక విమర్శలు
  టౌన్‌హాల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా బాలకృష్ణ ఆగ్రహం

 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కొత్తూరు/పాలకొండ/శ్రీకాకుళం అర్బన్ ః తెలుగుదేశం పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. తెలంగాణాలో టీడీపీ సీనియర్లంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు తన అనుకూల పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాయిస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలో చేరుతున్నారంటూ  రాయించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలో చేరుతున్నట్టు వచ్చిన కథనంపై గురువారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కలమట వెంకటరమణ, కంబాల జోగులు తీవ్రంగా ధ్వజమెత్తారు.
 
  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని, హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు ఆయనకు గుణపాఠం నేర్పాయని విమర్శించారు. చంద్రబాబుతో సావాసం చేసిన వాళ్లకెవరైనా ఆయన వైఖరి స్పష్టమవుతోందని, ప్రస్తుతం టీడీపీలో వర్గవిభేదాలు, గ్రూపు రాజకీయాలతో నళ్లేరు నడకలా ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పాలనతో ప్రజల నుంచి విమర్శలొస్తుండడం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం కనిపిస్తుండడంతో చంద్రబాబు నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
 
  వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మంచి పేరును ఓర్వలేకే చంద్రబాబు సహా టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా వార్తలు రాయించుకుం టున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సీనియర్లంతా ఆ పార్టీని వీడి తెలంగాణాలో టీఆర్‌ఎస్‌లో చేరిపోతుండడాన్ని జీర్ణించుకోలేకే ఇక్కడి ఎమ్మెల్యేలంతా తన వైపే ఉన్నారన్న ప్రచారాన్ని మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. మాతల గ్రామంలో ఎమ్మెల్యే కలమట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వైఖరిని స్పష్టం చేశారు.  శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో రాజాం ఎమ్మెల్యే మాట్లాడారు. పాలకొండలో ఎమ్మెల్యే కళావతి విలేకర్ల సమావేశంలో పార్టీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం తో పాటు పార్టీ రాష్ర్ట కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు.  
 
 టీడీపీ మునిగిపోతున్న నావ
 టీడీపీ మునిగిపోయే నావ. సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ తెలియనిది కాదు. వైఎస్సార్‌సీపీని వీడేది లేదు. కొన్ని పత్రికలు, టీవీల్లో వస్తున్న వార్తలు బాధాకరం. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో వారి నుంచి దూరమవుతున్న టీడీపీలో ఎవరైనా చేరారంటే అది హాస్యాస్పదమే అవుతుంది. ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేయడం టీడీపీ నైజం. తెలంగాణలో దుకాణం సర్దేసిన టీడీపీ ఆంధ్రలో చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి.  
   -ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
 
 పార్టీ వీడే ప్రశ్నే లేదు
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నే లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున రాజాం ఎమ్మెల్యేగా గెలిచా. రాష్ట్రంలో పార్టీకి 67మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లలో ఎవరూ కూడా పార్టీ వీడరు. టీడీపీ మైండ్‌గేమ్ బయటపడుతోంది. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. అక్కడ ఆ పార్టీ ఖాళీ అయిపోవడంతో ఆంధ్రాలో కూడా ఇలాగే జరుగుతుందని ఊహించి ముందస్తు జాగ్రత్తగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేరిపోతున్నారని ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో దుర్మార్మ పాలన నడుస్తోంది. టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు.  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై, వాటి పరిష్కారం కోసం కలసి పనిచేస్తున్నాం.
  రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు
 
 గ్రేటర్ ఫలితాలతో దిమ్మతిరిగింది
 గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగిన చంద్రబాబు మైండ్‌గేమ్‌కు తెరతీశారు.  చంద్రబాబు నాయుడుకు పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్ ఫలితాల్లాగే ఆంధ్రాలో కూడా చుక్కెదురవుతుంది. పార్టీలో ఉన్న నాయకులు బయటకు వెళ్లిపోకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. తెలంగాణాలో టీడీపీ పని చాపచుట్టేసినట్టే. 2019 ఎన్నికల్లో ఆంధ్రాలోను ఆ పార్టీకి ఇదే పరిస్థితి వస్తుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం చేసే కంటే టీడీపీలో ఉన్న వారు జారిపోకుండా బాబు చూసుకోవాలి. ప్రజాఆమోదం కోల్పోయిన చంద్రబాబుకు ఇలాంటి మైండ్‌గేమ్‌లు కొత్త కాదు.
 -పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement