అత్మ స్తుతి...పరనింద
Published Wed, May 24 2017 12:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ప్రతిపక్షంపై విమర్శలే అజెండా
- పార్టీకి దిశ, నిర్దేశం గాలికి వదిలేసిన వక్తలు
- చినబాబు భజనలో పోటాపోటీ
- జిల్లా సమస్యల ప్రస్తావనే లేని వైనం..
.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
పార్టీకి దిశా, దశ నిర్థేశనం చేయాల్సిన టీడీపీ మినీ మహానాడు బహిరంగ సభ మాదిరి ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలే అజెండాగా సాగింది. విశాఖలో జరిగే పార్టీ రాష్ట్ర మహానాడుకు కేడర్‌ను ముందస్తు సన్నాహకంలో భాగంగా ప్రత్తిపాడు పామాయిల్ తోటల మధ్య మంగళవారం మినీ మహానాడు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా నడిచింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజన విరామంతో ముగిసింది. గడచిన నాలుగైదు రోజులుగా టీడీపీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంపై పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ మినీ మహానాడును ప్రభావితం చేశాయి. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిని ప్రకటించడం సంప్రదాయంగా పార్టీ నేతలు భావించారు. తీరా ఆ ప్రక్రియకు తెరదించలేక చేతులెత్తేయడం పార్టీ ముఖ్యనేతల వైఫల్యాన్ని చెప్పకనే చెప్పింది. జిల్లాలో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించి వాటికి పరిష్కారం చూపించే దిశగా ప్రతిపాదనలు మహానాడు ముందుంచాలనేది పార్టీ ఆలోచన. పార్టీ కేడర్, చివరకు నేతలు కూడా అదే ఆశించారు. కానీ ప్రజా సమస్యలపై చర్చ మొక్కుబడి తంతుగానే ముగించడం కార్యకర్తల్లో సైతం నిరాశనే మిగిల్చింది. ఒక్కో నేతకు ఒక్కో అంశంపై సావధానంగా చర్చించి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కొద్దిసేపటికే ‘సమయం లేదు మిత్రమా’ అంటూ ముగింపు పలికే వరకూ వెంటపడటం విమర్శపాలైంది. వేదికపై మహానాడును నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఈ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారనే చెప్పాలి. అంటే ఏ ఒక్క నాయకుడినీ తనకు అప్పగించిన సబ్జక్టుపై పూర్తిగా మాట్లాడకుండా సమయం లేదంటూ మైకు కొడుతూ మధ్యలోనే ప్రసంగాన్ని ముగించే వరకు వదిలిపెట్ట లేదు.
.
జిల్లా సమస్యలపై చర్చేదీ...?
మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా సర్కార్ చిన్నచూపు చూడటం, విలీన మండలాల్లో గిరిజనుల సమస్యలు పట్టించుకోకపోవడం, పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్, మెట్టలో సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ తదితర సమస్యలపై పూర్తిగా చర్చకు అవకాశం దక్కక నేతలు అసహనానికి గురవడం కనిపించింది. ఈ విషయాల్లో చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని ఎమ్మెల్యేలు, ఆ విభాగ నేతలు పరోక్షంగా చెప్పకనే చెప్పడం చర్చనీయాంశమైంది. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎప్పటిలానే అసలు సమస్యలను విడిచిపెట్టి రైతు పక్షపాతి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని రైతులకు ఏమీ చేయలేదంటూ ఆడిపోసుకోవడానికే సమయాన్నంతటినీ వెచ్చించడం కేడర్‌లో చిరాకు కలిగించింది. కెఎస్‌ఈజడ్‌లో 10వేల ఎకరాలు బలవంతంగా సేకరించారంటూ వైఎస్‌పై విమర్శలు సంధించిన వర్మ అసలు ఆ జీఓ ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అన్న సంగతి తెలిసి కూడా విమర్శలతో రాజకీయ ప్రసంగం సాగించడంపై ఆ వర్గంలోనే గుసగుసలు వినిపించాయి. రాజకీయాల్లో అపారమైన అనుభవం కలిగిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా మినీ మహానాడు వేదికను బహిరంగ సభ మాదిరిగా కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయడం గమనార్హం. జిల్లాలో నలుమూలలా ఉన్న ప్రధాన సమస్యలను మినీ మహానాడు ద్వారా చర్చించి ఆర్థిక మంత్రిగా తనకున్న పలుకుబడిని వినియోగించి విశాఖ మహానాడులో ఆమోదింప చేయించి తమ సత్తా చాటాల్సిన యనమల ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డిపై చౌకబారు రాజకీయ విమర్శల ద్వారా మినీ మహానాడు లక్ష్యాన్ని దెబ్బతీశారన్న విమర్శలు వినిపించాయి. ప్రలోభాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చిన వారంతా సచ్చీలురుగా పొగడడం, ప్రతిపక్షంలో ఉన్న వారిపై కేసులు ఉన్నాయనే విమర్శలకు తప్ప మరో వేదిక దొరక లేదా అని ఆ పార్టీ కేడరే విమర్శలు గుప్పించింది. యనమల మొత్తం ప్రసంగంలో కోటిపల్లి రైల్వే ౖలైన్‌ను, పిఠాపురం–కాకినాడ మెయిన్ లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 శాతం వాటా భరించేలా చూస్తానని కాస్తంత ఊరటనిచ్చే అంశాన్ని ప్రకటించడం కొసమెరుపు.
.
లోకేష్ భజన...
మినీ మహానాడులో ప్రసంగించిన మెజార్టీ నేతలు సీఎం తనయుడు నారా లోకేష్ జపం చేయడంలో ఒకరు మించి ఒకరు పోటీపడటం కనిపించింది. పార్టీ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నిమ్మల రమానాయుడు ఒక అడుగు ముందుకేసి లోకేష్ విద్యాభ్యాసం దగ్గర నుంచి మొదలుపెట్టి హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా సమర్థవంతమైన సేవలందిస్తూ పార్టీ భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉందని చెప్పుకు రావడం సహచర నేతలే విస్తుపోయేటట్టు చేసింది.
.
అసంతృప్తి నేతల డుమ్మా...
పార్టీలో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు మినీ మహానాడుకు డుమ్మా కొట్టారు. మంత్రి పదవి దక్కక రోడ్డెక్కి రచ్చరచ్చ చేసిన మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి కనిపించ లేదు. ఈయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మినీ మహానాడు జరుగుతుందని తెలిసి ముందుగానే ఆయన అమెరికాకు చెక్కేశారని నేతలు చర్చించుకోవడం కనిపించింది. అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు పండుల రవీంద్రనాథ్ మురళీమోహన్ కూడా గైర్హాజరయ్యారు. మొత్తంమీద ప్రత్తిపాడు మినీ మహానాడు నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్న ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు పార్టీ వైపు నుంచి లభించే భరోసా ఏమిటో భవిష్యత్తులో తేలనుంది.
Advertisement
Advertisement