టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగింపు
-
ముగింపు సభకు హాజరైన మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు
-
నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణ అన్న నాయకులు
కందుకూరు: ఏడాదిగా స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న మూడు జిల్లాల టీడీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. దాదాపు ఏడాది కాలం పాటు 100 బ్యాచ్‌లకు బ్యాచ్‌కి 100 మంది లెక్కల నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చారు. శనివారం 100వ బ్యాచ్ ముగింపు సందర్భంగా ముగింపు సభను స్థానిక ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్ధన్, జివిఎస్ ఆంజనేయులు, బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం కష్టాల్లో ఉన్నా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తోందన్నారు. పింఛన్‌లు, రుణామాఫీ, పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం సభ్యత్వం దాదాపు 50 లక్షల వరకు ఉందన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన శిబిరం డైరెక్టర్ దాసరి రాజామాస్టర్, కన్వీనర్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్, కంచర్ల రామయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, పమిడి రమేష్, బెజవాడ ప్రసాద్, కాకర్ల మల్లికార్జున, శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు.