
మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావుకు అంతిమ వీడ్కోలు
అమలాపురం తరలివచ్చిన ప్రముఖులు, అభిమానులు
‘కిమ్స్’ సమీప స్థలంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమలాపురం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుకు కోనసీమవాసులు శనివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను చివరిసారి చూసి, నివాళులర్పించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అమలాపురం తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు మెట్లకు శ్రద్ధాంజలి ఘటించారు.
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందిన మెట్ల శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని శనివారం తెల్లవారుజామున అమలాపురంలోని స్వగృహానికి తీసుకు రాగానే కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీరుమున్నీరుగా విలపించారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మెట్ల భౌతిక కాయానికి నివాళులర్పించారు.
మెట్ల అమర్ రహే..
సర్వమత ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మెట్ల అంతిమయాత్ర పట్టణవీధుల్లో సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై మంత్రులు రాజ ప్ప, యనమల, ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఉన్నారు. మెట్ల తనయుడు రమణబాబు, సోదరుడు సూర్యనారాయణతోపాటు పలువురు నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అంతిమయూత్ర సాగిన వీధుల్లో జనం అభిమాన నేతను కడసారి చూసి, నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యు డు పినిపే విశ్వరూప్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, పలువురు కార్యకర్తలు అంతిమయూత్రకు ముందు సాగారు. ముఖ్యమంత్రి రాకతో భారీ భద్రత ఏ ర్పాటు చేయడంతో ప్రజలు సమీపంలోని కొబ్బరితోట లు, పొలం గట్లపై చేరి అంత్యక్రియల్ని చూశారు. కిమ్స్ హాస్పటల్ సమీపంలో ప్రభుత్వం సేకరించిన స్థలంలో మెట్ల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సాగాయి. ‘మెట్ల అ మర్హ్రే’ అనే అభిమానుల నినాదాల మధ్య కుమారుడు రమణబాబు చితికి నిప్పంటించారు.
ప్రముఖుల నివాళి
ముఖ్యమంత్రి చంద్రబాబు 4.30 గంటలకు కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో హెలికాప్టర్‌లో దిగారు. ఆయనతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వచ్చారు. సుమారు అరగంట అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తిరిగి హెలికాప్టర్‌లో విజయవాడ వెళ్లారు. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీలు ఎస్.సత్యనారాయణ, బాబూరావునాయుడు, ఎ స్పీ రవిప్రకాష్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, కె.రవికిరణ్‌వర్మ, సోము వీర్రాజు, బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు, వేగుళ్ల జోగేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, ఆకుల సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, పులపర్తి నారాయణమూర్తి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, మాజీమంత్రులు చిక్కాల రామచంద్రరావు, పి.వి.రాఘవులు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యు లు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు కటకంశెట్టి సత్యప్రభాకర్, మాజీ ఎంపీలు ముద్రగడ పద్మనాభం, ఎ.జె.వి.బి.మహేశ్వరరావు, వంగా గీత, చిట్టూరి రవీంద్ర, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు మెట్లకు నివాళులర్పించారు. మెట్ల మృతికి సంతాపసూచకంగా అమలాపురం బంద్ నిర్వహించారు.
మెట్ల మృతి కోనసీమకు తీరనిలోటు
మెట్ల సత్యనారాయణరావు మృతి కోనసీమ వాసులకు తీరనిలోటని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మెట్ల కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం ఆమె పరామర్శించారు. మంత్రిగా పనిచేసిన కాలంలో మెట్ల జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.