
మూత ‘బడి’నా.. విధులకు టీచర్
వర్ధన్నపేట : అనేక పాఠశాలల్లో విద్యార్థులు వచ్చి.. ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూసీ..చూసి నిరాశతో వెనుదిరిగే విద్యార్థులను చూశాం.. కానీ ఈ పాఠశాలలో మాత్రం ఒక్క విద్యార్థి కూడా లేకున్నా ఉపాధ్యాయుడు మాత్రం రోజూ వచ్చి నిర్ణీత సమయం వరకు ఉండి వెళుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలు శివారు లక్ష్మీపురంలో 40 కుటుంబాలు ఉన్నాయి. అందులో పదేళ్లలోపు పిల్లలు 20 మంది ఉన్నారు. వారు కూడా ఐనవోలు, ఒంటిమామిడిపల్లి గ్రామాల్లోని పాఠశాలలకు వెళుతున్నారు.
లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్లు లేక మూడేళ్ల క్రితం మూతబడింది. అరుుతే పిల్లలు లేకున్నా ప్రభుత్వం ఉపాధ్యాయుడిని మాత్రం నియమించింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు భూక్యా వీరన్న అనే టీచర్ రోజూ పాఠశాలకు వస్తూ, శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. పలు స్కూళ్లలో సరిపడా పంతుళ్లు లేక ఇబ్బంది పడుతుంటే.. ఇక్కడ మాత్రం విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయుడిని నియమించిన విద్యాశాఖ వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.