
'ఎన్నికుట్రలు చేసినా ఎవరేం చేయలేకపోయారు'
విజయవాడ: చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. తనపై గతంలోనే ఎన్నో కుట్రలు జరిగాయని అయినా ఎవరూ ఏం చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్, చైనా, జపాన్ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు.
భూసేకరణ ద్వారా 53 వేల ఎకరాలు, అటవీ భూముల నుంచి మరో 50 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రతివారం మంత్రులు, అధికారులతో సమీక్ష జరుపుతామని తెలిపారు. ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహించి దేశంలోనే ప్రతిష్టాత్మక కేపిటల్ నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, రాజకీయ పార్టీల ప్రవర్తన, పార్లమెంటులో అనుసరించిన విధానంపై విధాన పత్రాన్ని చంద్రబాబునాయుడు ప్రకటించారు.