చర్ల, న్యూస్‌లైన్: ఉంజుపల్లి అడవుల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రోడ్డుపనులను అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులను అడ్డుకోవడానికి వీల్లేదు అని పోలీసులు వారిని హెచ్చరించారు. పనులకు అడ్డుపడిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిని పోలీసులు బలవంతంగా లాగేశారు. మహిళా ఉద్యోగిణులు అనికూడా చూడకుండా నెట్టివేశారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న స్థానిక విలేకరులపై ఎస్సై చిందులుతొక్కారు. పోలీసులను ప్రతిఘటించి వచ్చిన అటవీశాఖ అధికారులు రోడ్డుపనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌తో పాటు ఆ పనులకు మెటల్ తోలుతున్న నాలుగులారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే...
ఎల్‌డబ్ల్యూఈఏ నిధులతో మండలకేంద్రంలోని శివాలయం ఆర్చ్ నుంచి పూసుగుప్ప వరకు రెండేళ్లక్రితం 18 కిలోమీటర్ల మేర రోడ్డుపనులు ప్రారంభమయ్యాయి. మావోయిస్టుల భయంతో కాంట్రాక్టర్ గతంలో పనులు నిర్వహించకుండా వెళ్లిపోయారు. ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ రంగనాథ్ కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు పునఃప్రారంభించారు. ఈ పనులను నిలిపివేయాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి పనులు నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అనుమతల విషయమై అటవీశాఖ అధికారులు పలుమార్లు కాంట్రాక్టర్‌ను, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు.
వారు దాటవేత సమాధానాలు చెబుతూ వస్తున్నారు. భద్రాచలం ఉత్తర మండల డీఎఫ్‌ఓ రాజశేఖర్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్‌ఇంజినీర్ సుధాకర్‌రావుకు ఈ పనుల విషయమై రెండునెలల క్రితం షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. అయినా ఎటువంటి సమాధానం రాలేదు. దీనిపై డీఎఫ్‌ఓ స్థానిక అటవీశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా పనులు నిర్వహిస్తే సస్పెండ్ చేస్తానంటూ అటవీశాఖ సిబ్బందికి ఓ లేఖనూ ఇచ్చారు. నాలుగురోజులు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్తున్న అటవీశాఖ అధికారులను పోలీసులు తిప్పిపంపుతున్నారు. ఉంజుపల్లి సమీపంలోని అడవిలో పనులు జరుగుతున్నాయని తెలుసుకొని శనివారం అక్కడికి వెళ్లారు. మళ్లీ పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఎస్సై సంతోష్ తనపై చిందులు తొక్కారని డీఆర్వో కనకమ్మ ఆరోపించారు. ‘ప్రజలకు ఉపయోగకరమైన పనులకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు..రోడ్డుపనులను అడ్డుకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు పెట్టి మీరు వచ్చిన జీపులోనే మిమ్మల్ని తీసుకొని వెళ్తాం’ అని హెచ్చరించారని ఆమె విలేకరులకు తెలిపారు. పనులకు అడ్డుపడిన అటవీశాఖ సిబ్బందిని పోలీసులు బలవంతంగా లాగేశారన్నారు. మహిళా ఉద్యోగిణులు అని కూడా చూడకుండా నెట్టివేశారని కనకమ్మ వాపోయారు.
రిజర్వ్‌ఫారెస్ట్‌లో గ్రావెల్ పోయడం ఆపేసిన పోలీసులు వెంటనే ఉంజుపల్లి గ్రామంలోని రోడ్డుకు గ్రావెల్ తోలకం ప్రారంభించారు. సాయంత్రం మెటల్ వేసుకొని నాలుగులారీలు లెనిన్‌కాలనీ, ఉంజుపల్లి మధ్యలోని రిజర్వ్‌ఫారెస్ట్‌లోని రోడ్డుమీదకు వచ్చాయి. కంకర దింపేందుకు డ్రైవర్లు ప్రయత్నించడంతో అటవీశాఖ అధికారులు అడ్డుపడ్డారు. అనుమతులు లేనందున ఇక్కడ దించొద్దని చెప్పారు. ఎస్సై సంతోష్ జోక్యం చేసుకొని అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఎస్పీగారి ఆదేశాల మేరకే రోడ్డు పనులు చేయిస్తున్నాం..అడ్డుతప్పుకోపోతే పరిస్థితి సీరియస్‌గా ఉంటుంది’ అని హెచ్చరించారు. పోలీస్, అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ ఏఎస్సై, ఎఫ్‌బీఓ నాగేశ్వరరావుపై విరుచుకుపడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై ఎస్సై చిందులు తొక్కారు. ‘ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ సంగతి చూస్తాను’ అంటూ బెదిరింపు ధోరణికి దిగారు. విలేకరులు స్పందించకపోవడంతో ఎస్సై అక్కడి నుంచి వెళ్లి ఉంజుపల్లి గ్రామస్తులను వెంటవేసుకొని వచ్చారు. ‘మీ రోడ్డు పనులకు అడ్డుతగులుతున్నారని’ ప్రజలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఫారెస్ట్ సిబ్బందిని పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టి రిజర్వ్‌ఫారెస్ట్‌లో వేస్తున్న రోడ్‌పై మెటల్ అన్‌లోడ్ చేయించారు. చర్లలోనూ ఇలాగే అన్‌లోడ్ చేస్తున్నారని తెలుసుకొని అటవీశాఖ సిబ్బంది వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులు చర్లకు వచ్చేలోగా లారీలను భద్రాచలం తరలించవచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో అడ్డువచ్చిన డీఆర్వో కనకమ్మతోపాటు అటవీశాఖ సిబ్బందిని బలవంతంగా లాగిపడేశారు. ఎట్టకేలకు పోలీసులను ప్రతిఘటించి ఫారెస్ట్ సిబ్బంది చర్లకు వచ్చారు. లారీలను నిలిపివేసి నలుగురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. లారీలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌పైనా కేసులు నమోదు చేశారు.
ఉంజుపల్లి అడవుల్లో ఉద్రిక్తత
Published Sun, Feb 23 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement