గోపీకృష్ణ ఎక్కడ? | Terrorist Kidnapped Gopi Krishna | Sakshi
Sakshi News home page

గోపీకృష్ణ ఎక్కడ?

Published Sun, Mar 13 2016 12:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

గోపీకృష్ణ ఎక్కడ? - Sakshi

గోపీకృష్ణ ఎక్కడ?

ఆచూకీ కోసం కుటుంబసభ్యుల గగ్గోలు
పట్టించుకోని జిల్లా యంత్రాంగం, నాయకులు
ఓదార్పుతోనే సరంటున్న గోపీకృష్ణ బంధువులు
పుట్టినరోజూ మాట్లాడలేకపోయామంటున్న సోదరుడు
తండ్రి సంరక్షణ కోసం పిల్లల ఎదురుచూపు

 
 ఉపాధి కోసం పొరుగు దేశం వెళ్లి అక్కడి ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌నకు గురైన తిరువీధుల గోపీకృష్ణ (40) ఆచూకీ దొరక్క ఏడు నెలలవుతున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. టెక్కలికి చెందిన రిటైర్డ్ కో- ఆపరేటివ్ విభాగ ఉద్యోగి టి.వి.నారాయణరావు రెండో కుమారుడు గోపీకృష్ణ లిబియా దేశంలో ఓ సంస్థలో కంప్యూటర్ సైన్స్‌లో ఫ్యాకల్టీగా ఉద్యోగం చేస్తూ గతేడాది జూలై 29న కిడ్నాపయిన విషయం తెలిసిందే. మొత్తం నలుగుర్ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేయగా కొన్నాళ్ల తరువాత ఇద్దర్ని విడిచిపెట్టారు. ఇప్పటికీ ఉగ్రవాదుల చేతిలోనే గోపీకృష్ణ ఆయన సహచరుడు, తెలంగాణకు చెందిన బలరాంలు ఉన్నారు. ఇన్నాళ్లవుతున్నా గోపీకృష్ణ అచూకీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడం, మేమున్నామంటూ జిల్లా యంత్రాంగం గోపీ కుటుంబసభ్యులకు భరోసా ఇవ్వలేకపోవడంపై బంధువులు గగ్గోలు పెడుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గోపీకృష్ణ కిడ్నాప్ సంఘటన జరిగిన తరువాత కొన్నాళ్లకు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు బాధితుని తల్లిదండ్రుల్ని పరామర్శించారు. వారి ఓదార్చి వీలైనంత త్వరలో విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఘటన జరిగి ఏడు నెలలవుతున్నా ఇప్పుడు కనీసం స్పందించకపోవడంపై గోపీకృష్ణ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
 ఎవర్ని కలవాలో చెప్పండి
 గోపీకృష్ణ, బలరాంలు క్షేమంగానే ఉన్నారని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ పీఏ ద్వారా గోపీ బంధువులు తెలుసుకుంటున్నారు తప్పితే ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితిలో బాధిత కుటుంబసభ్యులున్నారు. తెలంగాణ ఎంపీ రంగారెడ్డి కూడా భరోసా ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తన కుమారుడి ఆచూకీపై బెంగ పెట్టుకున్న గోపీ తండ్రి, సోదరుడు మురళీకృష్ణ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌కు మరోమారు ఫిర్యాదిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానిక ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ సమావేశంలో ఒకేసారి ఈ విషయం చర్చించినా, తరువాత జరిగిన రెండు సమావేశాల్లో విషయాన్ని ప్రస్తావించలేకపోయారని గోపీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంపీ కార్యాలయంలోనూ సమాచారం కరువైందని మదనపడుతున్నారు. జిల్లా మంత్రి మరింత చొరవ చూపి గోపీకృష్ణ విడుదల విషయం మేం చూసుకుంటామని హామీ ఇచ్చి ఇన్నాళ్లవుతున్నా ఆయన నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు. ఎవర్ని కలవాలో, ఏం చేయాలో, తన కొడుకు ఏమయ్యాడోనని గోపీ తల్లిదండ్రులు నారాయణరావు, సరస్వతి కన్నీరు రాల్చని రోజు లేదు.
 
 నాలుగేళ్లకోసారి పుట్టినరోజు
 ఇటీవలే 40 యేళ్లు పూర్తిచేసుకున్న గోపీకృష్ణ లీప్ ఇయర్‌లో జన్మించారు. ఉద్యోగం కోసం 2007లో లిబియా వెళ్లారు. నాలుగేళ్లకోమారు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆనందోత్సవాల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. ఫిబ్రవరి 29, 2016న కూడా ఇక్కడకు వచ్చి వేడుకలు జరుపుతారని, మరి లిబియా వెళ్లేది లేదని గతంలో అంతా నిర్ణయించారు. ఆ సంతోషకరమైన రోజు రానే వచ్చింది. కానీ గోపీ తమ మధ్య లేకపోవడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
 గోపీ భార్య కల్యాణి, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం హైద రాబాద్‌లోనే ఉన్నారు. గోపీ సోదరుడు మురళీకృష్ణ ప్రస్తుతం వారి సంరక్షణ చూస్తున్నారు. గోపీ సోదరి విశాఖలో ఉంటున్నారు. తల్లిదండ్రులు టెక్కలిలో ఉంటున్నారు. ఉద్యోగం నిమిత్తం లిబియా వెళ్లిన గోపీ కిడ్నాప్ కాకముందు కూడా జీతం తీసుకోలేకపోయారు. కిడ్నాప్ తరువాత ఏడు నెలలుగా గోపీ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ పోషణకూ ఇబ్బందవుతోందని బంధువులు చెబుతున్నారు. తండ్రి సంరక్షణ కోసం పిల్లలు పడిగాపులు కాస్తున్నారు.
 
  తమవాడెప్పుడు వస్తాడోనని కుటుంబసభ్యులు, బంధువులు ఆతృతగా చూస్తున్నారు. అయినా జిల్లా మంత్రి, ఎంపీల నుంచి ఎలాంటి సమాచారం లేదని వారంతా వాపోతున్నారు. లిబియాలో ప్రస్తుతం ప్రభుత్వం దిగిపోవడం, కొత్త ప్రభుత్వం ఏర్పడకపోవడం, ఇతర దేశస్తులకు వీసా కూడా ఇవ్వకపోవడంతో తాము లిబియా వెళ్లేందుకూ ప్రయత్నించలేకపోయామని వారంటున్నారు. ఒకటి రెండు సార్లు ఫోన్ రింగయినా ప్రస్తుతం గోపీ ఫోన్ స్విచాఫ్ వస్తోందన్నారు.  ఉగ్రవాద శిక్షణ కోసమే లిబియా తీవ్రవాదులు తమ వద్ద గోపీ, ఇంగ్లిషు ఫ్యాకల్టీ బలరాంలను ఉంచేసుకున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకే కిడ్నాప్ విషయం తెలిసిందని బంధువులు చెబుతున్నారు.
 
 నేతలే చొరవ చూపాలి
 గోపీకృష్ణ ఆచూకీపై నేతలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చొరవ చూపాలి. గోపీ భార్య, పిల్లలకు ఆర్థికంగా కూడా ఇబ్బంది వస్తోంది. ఎవర్ని కలవాలో, ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. పుట్టినరోజు కూడా చేసుకోలేకపోయాం. నాయకులు వచ్చి ఓదార్చి వెళ్తున్నారు తప్పితే ఏం చేయలేకపోయారు.
 తిరువీధుల మురళీకృష్ణ, గోపీకృష్ణ సోదరుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement