ఇక డిజిటల్ డోర్ నంబర్లు
ఇక డిజిటల్ డోర్ నంబర్లు
Published Tue, May 23 2017 9:29 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM
పోతవరం (నల్లజర్ల) : జిల్లాలో అన్ని గ్రామ, నగరపాలక, పురపాలక సంఘాల్లో ఇళ్లకు త్వరలో డిజిటల్ డోర్ నంబర్లు ఏర్పాటు చేయనున్నారు. గణిత భాషలో వేసే నంబర్లు తెలుసుకోవడం ప్రభుత్వ సిబ్బందికి కష్టంగా ఉండేది. అలా కాకుండా ఒకే చట్రంలో రాష్ట్రం, పట్టణం, వార్డు, వీధి, ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబర్ కేటాయించనున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలను భౌగోళిక సమాచార (జీఐఎస్) వ్యవస్థతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నల్లజర్ల మండలంలోని స్మార్ట్ విలేజ్ పోతవరంలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ఆవిష్కరించారు.
శాస్త్రీయ విధానంలో ఇళ్ల నంబర్ల కేటాయింపు
అన్ని గ్రామాల్లో ఇళ్లు, వీధుల హద్దులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫుట్‌పాత్‌లు, పార్క్‌లు, రహదారులు, చప్తాలు, ల్యాండ్ మార్క్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పబ్లిక్ ట్యాప్‌లు, చెత్తకుండీల ప్రదేశాలు, పక్కా కాలువలు తదితర 59 అంశాలకు సంబంధించి వివరాలు సేకరించి భౌగోళిక సమాచార వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. సర్వేలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఇళ్ల నంబర్లను మార్పు చేసి శాస్త్రీయవిధానంలో కేటాయిస్తారు. ఇంటి నంబర్లలో ముందుగా రాష్ట్రం, గ్రామం, వీధి, వార్డు ఇంటి నంబర్‌తో డిజిటల్ ఇంటి నంబరు కేటాయించగా జియోట్యాగింగ్ చేస్తారు. నంబర్ ప్లేటు ఎదుట స్వచ్ఛభారత్ సింబల్‌తో పరిశుభ్రత, ఆరోగ్యం సూచిస్తూ స్వచ్ఛత వైపు అని సూచిస్తూ వెనుక వైపు డిజిటల్ మైక్రో ఐడీ నంబర్ ఉంటుంది. దీనిని ఇంటి యజమాని పంచాయతీ అసెస్‌మెంట్ నంబర్‌తో అనుసంధానించి ఇంటి గుమ్మంపై స్క్రూలతో బిగిస్తారు. అదే నంబర్ స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం పోతవరంలో ఈ విధానం అమలుకు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్త సేకరణ సమయంలో సిబ్బంది ఆ డిజిటల్ బోర్డుపై స్కానర్ వంటి ప్రత్యేక పరికరంతో స్కాన్ చేస్తారు. వెంటనే సంబంధిత గృహ యజమానికి, పంచాయతీ అధికారులకు ఆ ఇంటి నుంచి చెత్త సేకరించినట్టు ఫోన్ ద్వారా సమాచారం (మెసేజ్) వస్తుంది. ఇదే సమాచారం సంబంధిత సర్పంచ్, కార్యదర్శి, సీఎం డ్యాష్ బోర్డుకు సైతం చేరుతుంది. సిబ్బంది ఎక్కడ ఏ౾ చేస్తున్నారనే విషయం సులభంగా తెలుస్తుందని గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్ వెల్లడించారు. ఇంటి యజమానుకులకు ఇచ్చిన మైక్రో డిజిటల్ నంబర్‌తో గ్రామంలో పంచాయతీ ద్వారా తాగునీరు అందకపోయినా, వీధిలైటు వెలగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. ఈ విధానం ద్వారా మరిన్ని కార్యక్రమాలు అమల్లోకి తేనున్నట్టు గ్రామ కార్యదర్శి రంగనాయకమ్మ తెలిపారు.
Advertisement
Advertisement