
‘నీలగిరి’లో నిప్పులు
అత్యధికంగా 44.2 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదు
ఉదయం 8 గంటల నుంచే వేడిగాలులు నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు.. అల్లాడుతున్న ప్రజలు
నల్లగొండ టౌన్: నీలగిరి నిప్పుల కొలిమిగా మారింది. ఈ సీజన్‌లో ఎన్నడూ లేని విధంగా శనివారం 44.2 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే వేడిగాలులు వీస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు చాలా వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, దినసరి కూలీలు, వ్యాపారస్తులు మినహా సామాన్యులు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు.
శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వడగాడ్పుల కారణంగా వారికి తోడుగా వచ్చిన తల్లిదండ్రులు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నిలువనీడ, తాగునీరు లేక అవస్థలు పడ్డారు. ఎండలు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు ఏసీలు, కూలర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
సాయంత్రం వరకు ఎండలు మండుతుండడంతో పనులకు వెళ్లే వారు కేవలం సాయంత్రం 7 గంటల తర్వాతనే బయటికి వస్తున్నారు. పట్టణాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకం దారులు, ఉపాధి హామీ కూలీలు, దినసరి కూలీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేని స్థితి.
గడిచిన పక్షం రోజుల్లోనే పదిహేను మందికి పైగా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ మూడో వారంలోనే ఎండలు మండుతుంటే మే నెలలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎండల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.