హత్యా.. ఆత్మహత్యా... | The mysterious death of a young woman | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా...

Published Mon, Jul 18 2016 2:20 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

హత్యా.. ఆత్మహత్యా... - Sakshi

హత్యా.. ఆత్మహత్యా...

యువతి అనుమానాస్పద మృతి
అత్యాచారయత్నం చేసి హతమార్చారంటూ
ఇద్దరు యువకులను చితకబాదిన స్థానికులు వారిలో ఒకరు మృతి
మహ్మదీయపాలెంలో ఘటన... ఉద్రిక్తత

 
నిజాంపట్నం/రేపల్లెరూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా...ఆమెపై అత్యాచారయత్నం చేసి హత్యచేశారంటూ స్థానికులు ఇద్దరు యువకులను చితకబాదడంతో వారిలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెం దాడు. గుంటూరుయ జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయ పాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... మహ్మదీయపాలెంకు చెందిన షేక్ జాస్మిన్ (19) తన తల్లి  మెహరునిసా, సోదరులు ఇద్దరూ  పొరుగు ఇంటివారి శుభకార్యానికి మట్లపూడి వెళ్లగా ఆదివారం ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి ఆమెపై అత్యాచారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతో నడుముకు ఉన్న బెల్టును తీసి మెడకు చుట్టి దారుణంగా హతమార్చారని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జాస్మిన్ ఉరివేసుకుంటానంటోందటూ పక్కింట్లో ఉన్న పలువురు వృద్ధులకు శ్రీసాయి,పవన్‌కుమార్‌లు తెలపడంతో స్థానికులు వచ్చి చూసేటప్పటికీ జాస్మిన్ కిందపడి మృతిచెంది ఉందని తెలిపారు. ఉరివేసుకోకుండా ఎలా మృతిచెందిందంటూ వీరిద్దరినీ ప్రశ్నించడంతో ఉరివేసుకుని మృతి చెందిందని, తామే తీశామన్నారని తెలిపారు.


వంటగదిలో ఉరివేసున్నట్లు వీరిద్దరూ ఆరోపిస్తుంటే బెడ్‌రూమ్‌లోని మంచంపై నెత్తుటి మరకలు, తెగిపడిన బెల్టు ఎలా ఉన్నాయంటూ స్థానికులు వారిద్దరినీ చితకబాది చెట్టుకు కట్టివేశారు. వేముల శ్రీసాయి గతంలో పలుసార్లు ఇంటిముందుగా ద్విచక్రవాహనంపై తిరుగుతుండేవాడని, ఇళ్ళలోని దారులలో తిరిగే పని మీకు ఏమిటంటూ పలుమార్లు హెచ్చరించామని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బలాత్కారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి ఒడికట్టి ఉంటారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వేముల శ్రీసాయి బాపట్లలో బీటెక్ చదువుతున్నాడు. జొన్నా పవన్‌కుమార్ రేపల్లెలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

పోలీసులు, స్థానికులకు తోపులాట
సంఘటనా స్థలాన్ని అడవులదీవి ఎస్‌ఐ కాటూరి శ్రీనివాసరావు పరిశీలించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించేందుకు వీలులేదంటూ మృతురాలి బంధువులు, స్థానికులు అడ్డుపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు, నగరం ఎస్‌ఐ బి.అశోక్ కుమార్  సంఘటనా స్థలానికి చేరుకుని చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, బాధితులకు   న్యాయం జరిగేలా దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీ నిచ్చారు. అయినప్పటికీ  రాజకీయ వత్తిళ్ళతో కేసును తప్పు దోవ పట్టిస్తారని, ఇక్కడినుంచి వారిద్దరినీ తీసుకు వెళితే తమకు న్యాయం జరగదని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  తాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పోలీసులు వేముల శ్రీసాయిని, జొన్నా పవన్‌కుమార్‌ను తీసుకు వెళుతుండటంతో బంధువులు, స్థానికులు అడ్డగించారు. పోలీసులకు, స్థానికులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు వారిద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని రేపల్లె సీఐ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులు,బంధువులు జాస్మిన్ హత్యకు గురైందని ఆరోపిస్తున్నారని,  ఘటనాస్థలాన్ని పరిశీలించి హత్యగానే తామూ అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగతా విషయాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.
 
నిందితుల్లో ఒకరి మృతి

జాస్మిన్ మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో వేముల శ్రీసాయి (18) మృతి చెందాడు. జాస్మిన్ మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు వేముల శ్రీసాయి, జొన్న పవన్‌లను తీసుకుని భట్టిప్రోలు వెళ్లగా వేముల శ్రీసాయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు రేపల్లె పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు చెప్పారు.
 
బంధువుల ఆందోళన
వేముల శ్రీసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వేముల శ్రీసాయిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ వీరు ఆందోళన చేపట్టారు.
 
రెండు నెలల్లో పెళ్లి.. ఇంతలోనే..
జాస్మిన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాస్మిన్ తండ్రి జిలానీ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లి మెహరునిసా కూలిపనికి వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్దకుమారుడు లారీ డ్రైవర్, చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. జాస్మిన్ 10వ తరగతి చదివి రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు ఇటీవల నగరం మండలం పెదపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగితో వివాహం కుదిరింది.మరో రెండు నెలల్లో వివాహం జరగనున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement