status of suspicious death
-
హత్యా.. ఆత్మహత్యా...
యువతి అనుమానాస్పద మృతి అత్యాచారయత్నం చేసి హతమార్చారంటూ ఇద్దరు యువకులను చితకబాదిన స్థానికులు వారిలో ఒకరు మృతి మహ్మదీయపాలెంలో ఘటన... ఉద్రిక్తత నిజాంపట్నం/రేపల్లెరూరల్: ఒంటరిగా ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా...ఆమెపై అత్యాచారయత్నం చేసి హత్యచేశారంటూ స్థానికులు ఇద్దరు యువకులను చితకబాదడంతో వారిలో ఓ యువకుడు అస్వస్థతకు గురై మృతి చెం దాడు. గుంటూరుయ జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవి పంచాయతీ మహ్మదీయ పాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... మహ్మదీయపాలెంకు చెందిన షేక్ జాస్మిన్ (19) తన తల్లి మెహరునిసా, సోదరులు ఇద్దరూ పొరుగు ఇంటివారి శుభకార్యానికి మట్లపూడి వెళ్లగా ఆదివారం ఒక్కతే ఇంట్లో ఉంది. ఆ సమయంలో అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నా పవన్‌కుమార్ ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి ఆమెపై అత్యాచారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతో నడుముకు ఉన్న బెల్టును తీసి మెడకు చుట్టి దారుణంగా హతమార్చారని స్థానికులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జాస్మిన్ ఉరివేసుకుంటానంటోందటూ పక్కింట్లో ఉన్న పలువురు వృద్ధులకు శ్రీసాయి,పవన్‌కుమార్‌లు తెలపడంతో స్థానికులు వచ్చి చూసేటప్పటికీ జాస్మిన్ కిందపడి మృతిచెంది ఉందని తెలిపారు. ఉరివేసుకోకుండా ఎలా మృతిచెందిందంటూ వీరిద్దరినీ ప్రశ్నించడంతో ఉరివేసుకుని మృతి చెందిందని, తామే తీశామన్నారని తెలిపారు. వంటగదిలో ఉరివేసున్నట్లు వీరిద్దరూ ఆరోపిస్తుంటే బెడ్రూమ్లోని మంచంపై నెత్తుటి మరకలు, తెగిపడిన బెల్టు ఎలా ఉన్నాయంటూ స్థానికులు వారిద్దరినీ చితకబాది చెట్టుకు కట్టివేశారు. వేముల శ్రీసాయి గతంలో పలుసార్లు ఇంటిముందుగా ద్విచక్రవాహనంపై తిరుగుతుండేవాడని, ఇళ్ళలోని దారులలో తిరిగే పని మీకు ఏమిటంటూ పలుమార్లు హెచ్చరించామని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బలాత్కారం చేయబోగా జాస్మిన్ అడ్డుకోవడంతోనే ఈ దారుణానికి ఒడికట్టి ఉంటారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. వేముల శ్రీసాయి బాపట్లలో బీటెక్ చదువుతున్నాడు. జొన్నా పవన్‌కుమార్ రేపల్లెలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. పోలీసులు, స్థానికులకు తోపులాట సంఘటనా స్థలాన్ని అడవులదీవి ఎస్ఐ కాటూరి శ్రీనివాసరావు పరిశీలించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించేందుకు వీలులేదంటూ మృతురాలి బంధువులు, స్థానికులు అడ్డుపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో రేపల్లె సీఐ మల్లికార్జునరావు, నగరం ఎస్ఐ బి.అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం అందరిపై ఉందని, బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు శిక్షపడేలా చూస్తామని హామీ నిచ్చారు. అయినప్పటికీ రాజకీయ వత్తిళ్ళతో కేసును తప్పు దోవ పట్టిస్తారని, ఇక్కడినుంచి వారిద్దరినీ తీసుకు వెళితే తమకు న్యాయం జరగదని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి పోలీసులు వేముల శ్రీసాయిని, జొన్నా పవన్‌కుమార్‌ను తీసుకు వెళుతుండటంతో బంధువులు, స్థానికులు అడ్డగించారు. పోలీసులకు, స్థానికులకు తోపులాట జరిగింది. ఎట్టకేలకు వారిద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని రేపల్లె సీఐ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు. కుటుంబ సభ్యులు,బంధువులు జాస్మిన్ హత్యకు గురైందని ఆరోపిస్తున్నారని, ఘటనాస్థలాన్ని పరిశీలించి హత్యగానే తామూ అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగతా విషయాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. నిందితుల్లో ఒకరి మృతి జాస్మిన్ మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరిలో వేముల శ్రీసాయి (18) మృతి చెందాడు. జాస్మిన్ మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు వేముల శ్రీసాయి, జొన్న పవన్‌లను తీసుకుని భట్టిప్రోలు వెళ్లగా వేముల శ్రీసాయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందినట్లు రేపల్లె పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు చెప్పారు. బంధువుల ఆందోళన వేముల శ్రీసాయి మృతి విషయం తెలుసుకున్న అతని బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. వేముల శ్రీసాయిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ వీరు ఆందోళన చేపట్టారు. రెండు నెలల్లో పెళ్లి.. ఇంతలోనే.. జాస్మిన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాస్మిన్ తండ్రి జిలానీ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోవడంతో తల్లి మెహరునిసా కూలిపనికి వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్దకుమారుడు లారీ డ్రైవర్, చిన్న కుమారుడు ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. జాస్మిన్ 10వ తరగతి చదివి రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు ఇటీవల నగరం మండలం పెదపల్లికి చెందిన ఆర్మీ ఉద్యోగితో వివాహం కుదిరింది.మరో రెండు నెలల్లో వివాహం జరగనున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సింగరాజుపల్లి(దేవరుప్పుల) : వ్యవసాయ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని సింగరాజుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ ఎల్లప్ప వ్యవసాయ బావి వద్ద నారుమడి కోసం మోటారు వేయగా నీళ్లు దుర్వాసనతో వచ్చాయి. వెంటనే చుట్టుపక్క పొలాల్లో ఉన్న రైతుల సహకారంతో బావిలో పరిశీలించగా గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దీనిపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ట్రెరుునీ ఎస్సై రామారావు, ఏఎస్సై విద్యాసాగర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బావి పక్కనే ఉన్న బండరాయిపై విడిచిన బట్టలు, మరోచోట చెప్పుల జత కనిపించాయి. స్థానికుల సహకారంతో బావిలోని మృతదేహాన్ని బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక యువకులు మృతదేహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి సింగరాజుపల్లి అల్లూరి సీతారామరాజు సెంటర్ వద్ద దాని గురించి చర్చిస్తుండగా.. అక్కడున్న పల్లపు లక్ష్మీ మృతుడిని తన అల్లుడు ఇరుగదిండ్ల నర్సింహ(30)గా గుర్తించింది. మూడు రోజులుగా అతడు కనిపించకుండా పోరుునట్లు పేర్కొంది. కాగా హైదరాబాద్‌లోని నాగోల్ సమీపంలోని తట్టె అన్నారానికి చెందిన ఇరుకుదిండ్ల నర్సింహ తమకు దగ్గరి బంధువుని పల్లపు లక్ష్మి పేర్కొంది. రెండో వివాహంగా తమ కూతురు రేణుకను ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి చేశామన్నారు. హైదరాబాద్‌లో అరటిపండ్ల కంపెనీలో పనిచేసే నర్సింహ తన భార్యను తీసుకెళ్లేందుకు మూడు రోజుల క్రితం సింగరాజుపల్లికి వచ్చాడు. అరుుతే పల్లపు లక్ష్మీ దంపతులు బాలింతరాలైన తమ కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు. దీంతో తానూ కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని చెప్పి, బయటికి వెళ్లినట్లు లక్ష్మి వివరించింది. ఈక్రమంలో బావిలో శవమై కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. -
భర్తే హత్య చేశాడు..
{పమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం పోలీసు విచారణలో నేరం అంగీకారం నిందితుడి అరెస్టు జగ్గయ్యపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కేసులో భర్త గిడుగు వెంకట నారాయణను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. వివరాలు.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణితో 45 రోజుల క్రితం వివాహమైంది. నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామానికి బంధువుల ఇంటి ఈ నెల 8న వెళ్లారు. తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైందని వెంకట నారాయణ భార్య రాణిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే ప్రభుత్వ వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు. దర్యాప్తులో భాగంగా భర్త వెంకట నారాయణ జాతీయ రహదారిపై ఫుడ్‌ప్లాజా వద్ద ఉన్నట్లు సమాచారం రావటంతో సిబ్బంది వెళ్లి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అతనిని విచారించగా నిత్యం తన భార్య అనుమానిస్తుండేదని దీంతో తరచు గోడవ పడేదని ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులోని పొలాల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్లు చెప్పారు. పైగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా నారాయణ ప్రయత్నించాడన్నారు. అరెస్ట్ చేసిన నారాయణను పేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
పాల డబ్బా కోసం వెళ్లి.. ఎముకల గూడుగా మిగిలి..
అనుమానాస్పద స్థితిలో బాలు మృతదేహం లభ్యం 20 రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని అనుమానం హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ కొత్తగూడ : కూతురి కోసం పాల డబ్బా తీసుకొస్తానని వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇరవై రోజు లుగా అతడి రాకకోసం చూస్తున్న కుటుం బ సభ్యులకు అతడు చివరికి ఎముకల గూడుగా కనిపించాడు. ఈ సంఘటన కొత్తగూడ - కిష్టాపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గూడూరు సీఐ రమేష్ నాయక్ కథనం ప్రకారం... మండలంలోని వేలుబెల్లి సమీపంలోని చెరువుముందు తండాకు చెందిన బాదావత్ బాలు(25) గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా బయ్యారం సమీపంలోని క్వారీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం అక్కడి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వచ్చాడు. రెండు రోజుల తర్వాత అతడి భార్య కవిత కూతురు మిల్కీకి పాలు కావాలని చెప్పడంతో ఆ ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో ఉంచి, సొంత గ్లామర్బైక్పై కొత్తగూడ వచ్చాడు. ఆ తర్వాత అతడి సెల్‌ఫోన్ పనిచేయలేదు. అదేరోజు సాయంత్రం అతడు పని చేసే క్వారీ వద్ద నుంచి ఇద్దరు మనుషులు వారింటికి వచ్చి ‘బాలు ఫోన్ కలవడం లేదని, బండి తీసుకొచ్చి ఇక్కడే ఉంటే ఎలా’ అన్నారు. ‘బాలు రాగానే పని దగ్గరికి పంపండి’ అని చెప్పి బైక్ తీసుకొని వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి అతడి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా జాడ దొరకలేదు. దీంతో అతడి భార్య గురువారం పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొత్తగూడ, కిష్టాపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరికి ఎముకల గూడుగా శవం కనిపించింది. దీంతో అతడి సమాచారంతో పోలీసులు చేరుకుని అక్కడ లభించిన బైక్ ఆధారంగా మృతుడు బాలుగా గుర్తించారు. అతడు 20 రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని గూడూరు సీఐ రమేష్‌నాయక్ వెల్లడించారు. సంఘటన స్థలంలో మృతదేహం ఎముకలు చిందర వందరగా ఉండడం, బాలు బెల్టు, పర్సు, ధరించిన దుస్తులు అక్కడక్కడ పడి సగం సగం కాలిపోయి ఉన్నాయి. మరికొద్ది దూరంలో క్రిమిసంహారక మందు డబ్బా, మరో పక్క తాగిపడేసిన మూడు బీరు సీసాలు ఉన్నాయి. కాగా పని వద్ద నుంచి వచ్చిన వ్యక్తులే బాలును హత్య చేసి చంపి ఉంటారని మృతుడి తండ్రి రాంచంద్రు గూడూరు సీఐ రమేష్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. బాలును హత్య చేసి పెట్రోలు పోసి కాల్చి, పురుగులమందు డబ్బా వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూశారని ఆరోపించారు. మృతుడి తండ్రి, భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన ప్రతి వస్తువును సీజ్ చేశారు. ఎముకలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు.