{పమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
పోలీసు విచారణలో నేరం అంగీకారం నిందితుడి అరెస్టు
జగ్గయ్యపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కేసులో భర్త గిడుగు వెంకట నారాయణను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వైవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. వివరాలు.. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన వెంకట నారాయణకు గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన మునగోటి రాణితో 45 రోజుల క్రితం వివాహమైంది. నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామానికి బంధువుల ఇంటి ఈ నెల 8న వెళ్లారు. తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైందని వెంకట నారాయణ భార్య రాణిని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే ప్రభుత్వ వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వివరించారు.
దర్యాప్తులో భాగంగా భర్త వెంకట నారాయణ జాతీయ రహదారిపై ఫుడ్‌ప్లాజా వద్ద ఉన్నట్లు సమాచారం రావటంతో సిబ్బంది వెళ్లి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అతనిని విచారించగా నిత్యం తన భార్య అనుమానిస్తుండేదని దీంతో తరచు గోడవ పడేదని ఈ క్రమంలోనే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బైపాస్ రోడ్డులోని పొలాల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్లు చెప్పారు. పైగా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా నారాయణ ప్రయత్నించాడన్నారు. అరెస్ట్ చేసిన నారాయణను పేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.