మూడేళ్లపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్న మాజీ ఐఏఎస్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో నియామకానికి ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా (ఎస్‌ఈసీ) విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఐ.రాణీ కుముదిని నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు ఆమెను ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీచేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. గత నాలుగేళ్లుగా ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించిన సి.పార్థసారధి పదవీకాలం ఈ నెల 8న ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం గత ఫిబ్రవరితో ముగియగా ఏడున్నర నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది.
అదే విధంగా గత జూలై మొదటివారంలో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల ఐదేళ్ల పదవీకాలం ముగిసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తులో భాగంగా, అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల తయారీపై పార్థసారధి హయాంలో షెడ్యూల్ జారీచేశారు. ఈనెల 13న ముసాయిదా జాబితాల ప్రచురణ మొదలుపెట్టి, 28న ఓటర్ల తుది జాబితాలను ప్రచురించాలని ఈ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.
1988 బ్యాచ్ ఐఏఎస్...
ఉమ్మడి ఏపీలో అనేక హోదాల్లో పనిచేసిన దివంగత ఐపీఎస్ అధికారి ఇస్మాల్ పుల్లన్న కుమార్తె రాణీ కుముదిని. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా 2023 దాకా ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. తొలుత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జేసీగా, కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగానూ కొంతకాలం ఉన్నారు. కారి్మక, ఐఎల్‌వో కమిషనర్‌గా, ఉద్యానశాఖ కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సరీ్వసుల్లోకి వెళ్లారు. కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శిగా, ఎన్‌ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో కార్మికశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ సీఎస్) పనిచేశారు. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ పొందారు.
విజిలెన్స్ కమిషనర్‌గా గోపాల్
తెలంగాణ విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోపాల్ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పురపాలక శాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment