అనుమానాస్పద స్థితిలో బాలు మృతదేహం లభ్యం
20 రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని అనుమానం
హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
కొత్తగూడ : కూతురి కోసం పాల డబ్బా తీసుకొస్తానని వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇరవై రోజు లుగా అతడి రాకకోసం చూస్తున్న కుటుం బ సభ్యులకు అతడు చివరికి ఎముకల గూడుగా కనిపించాడు. ఈ సంఘటన కొత్తగూడ - కిష్టాపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గూడూరు సీఐ రమేష్ నాయక్ కథనం ప్రకారం... మండలంలోని వేలుబెల్లి సమీపంలోని చెరువుముందు తండాకు చెందిన బాదావత్ బాలు(25) గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా బయ్యారం సమీపంలోని క్వారీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం అక్కడి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వచ్చాడు. రెండు రోజుల తర్వాత అతడి భార్య కవిత కూతురు మిల్కీకి పాలు కావాలని చెప్పడంతో ఆ ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో ఉంచి, సొంత గ్లామర్‌బైక్‌పై కొత్తగూడ వచ్చాడు. ఆ తర్వాత అతడి సెల్‌ఫోన్ పనిచేయలేదు. అదేరోజు సాయంత్రం అతడు పని చేసే క్వారీ వద్ద నుంచి ఇద్దరు మనుషులు వారింటికి వచ్చి ‘బాలు ఫోన్ కలవడం లేదని, బండి తీసుకొచ్చి ఇక్కడే ఉంటే ఎలా’ అన్నారు.
‘బాలు రాగానే పని దగ్గరికి పంపండి’ అని చెప్పి బైక్ తీసుకొని వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి అతడి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా జాడ దొరకలేదు. దీంతో అతడి భార్య గురువారం పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే కొత్తగూడ, కిష్టాపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరికి ఎముకల గూడుగా శవం కనిపించింది. దీంతో అతడి సమాచారంతో పోలీసులు చేరుకుని అక్కడ లభించిన బైక్ ఆధారంగా మృతుడు బాలుగా గుర్తించారు. అతడు 20 రోజుల క్రితమే మృతిచెంది ఉండొచ్చని గూడూరు సీఐ రమేష్‌నాయక్ వెల్లడించారు. సంఘటన స్థలంలో మృతదేహం ఎముకలు చిందర వందరగా ఉండడం, బాలు బెల్టు, పర్సు, ధరించిన దుస్తులు అక్కడక్కడ పడి సగం సగం కాలిపోయి ఉన్నాయి. మరికొద్ది దూరంలో క్రిమిసంహారక మందు డబ్బా, మరో పక్క తాగిపడేసిన మూడు బీరు సీసాలు ఉన్నాయి.
కాగా పని వద్ద నుంచి వచ్చిన వ్యక్తులే బాలును హత్య చేసి చంపి ఉంటారని మృతుడి తండ్రి రాంచంద్రు గూడూరు సీఐ రమేష్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. బాలును హత్య చేసి పెట్రోలు పోసి కాల్చి, పురుగులమందు డబ్బా వేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చూశారని ఆరోపించారు. మృతుడి తండ్రి, భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంఘటన స్థలంలో లభించిన ప్రతి వస్తువును సీజ్ చేశారు. ఎముకలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు.
పాల డబ్బా కోసం వెళ్లి.. ఎముకల గూడుగా మిగిలి..
Published Sat, Mar 5 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
Advertisement
Advertisement