ప్రణాళిక లేకుండానే పనులా..? | The plan | Sakshi
Sakshi News home page

ప్రణాళిక లేకుండానే పనులా..?

Published Thu, Sep 15 2016 12:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ప్రణాళిక లేకుండానే పనులా..? - Sakshi

ప్రణాళిక లేకుండానే పనులా..?

  • పురోగతి లేదని అధికారులపై ధ్వజం
  • ప్రతి వారం నివేదిక సమర్పించాలని ఆదేశం
  • ఇందూరు:
    జిల్లాలో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులపై పనులపై కలెక్టర్‌ యోగితారాణా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని అధికారులపై మండిపడ్డారు. కార్యాచరణ ప్రణాళిక లేకుండానే పనులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ఆర్‌డబ్ల్యూఎస్, వాటర్‌గ్రిడ్‌ ఇంజినీర్లను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనులపై కలెక్టర్‌ బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జూలై 29న నిర్వహించిన సమీక్ష నాటికి, ఇప్పటికి పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించడం లేదని మండిపడ్డారు. కనీసం ఏయే పనులు చేయాలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    ప్రధాన పైపులైన్ల నిర్మాణానికి ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు సీసీరోడ్లు, బీటీరోడ్డు కట్‌ చేయాల్సి వస్తుందో స్పష్టంగా గ్రామాల వారీగా నివేదికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమయ్యే మెటీరియల్‌ను ముందస్తుగా నిర్మాణ సంస్థ నుంచి తెప్పించుకోవాలని సూచించారు. పనులు కాంట్రాక్టర్‌కు వదిలేస్తే కుదరదని, వారం వారం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనుల పురోగతిని బట్టే ఇంజినీరింగ్‌ అధికారులకు జీతాలను విడుదల చేయాలని ఎస్‌ఈలను ఆదేశించారు. 
    ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యమిస్తున్న మిషన్‌ భగీరథ పనులపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. పెద్దరెడ్డిపేట, అర్గుల్, ఇందల్‌వాయి, మల్లన్నగుట్టల్లో చేపట్టిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు వచ్చే మార్చి కల్లా కానున్నాయని యోగితారాణా వెల్లడించారు. మొత్తం 3,454 కిలోమీటర్ల పైపులైన్‌ పనుల్లో 901 కిలోమీటర్లకు సరిపడా పైపులు వచ్చాయని, వాటిలో 429 కిలోమీటర్ల పొడవు పైపులైన్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. అక్టోబర్‌ 31 నాటికి 121 గ్రామాల్లోని 60 వేల ఇళ్లకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 718 కిలోమీటర్ల పైపులైన్‌ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్రవిలేజ్‌ పైపులైన్ల నిర్మాణంతో పాటు ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసే నల్లా కనెక్షన్లు కూడా ఇవ్వాలని తెలిపారు. ఈ పథకంలో భాగంగా 100 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను నిర్మించాలని, అందులో 62 పనులు ప్రారంభయ్యాయని చెప్పారు. వారంలోపు మిగిలిన పనులను గ్రౌండింగ్‌ చేయాల, పనుల నాణ్యతను మానిటరింగ్‌ చేయాలని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్‌ ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ప్రజారోగ్య ఈఈ శ్రీనివాస్, డీఈఈలు, ఏఈలు, నిర్మాణ సంస్థ ఐహెచ్‌పీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement