రహదారులపై ఆరని రక్తపు తడి
- వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
- తెగిన తాతా, మనవరాలు అనుబంధం
- పెళ్లికి వెళ్లొస్తుండగా ఘటన
రహదారుల రక్తపు దాహం తీరేలా లేదు. బుధవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడగా, వారిలో దంపతులూ ఉన్న సంగతి తెలిసిందే. వాటికి కొనసాగింపుగా గురువారం మళ్లీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గుర్ని కబళించాయి. వారిలో తాతా, మనవరాలు ఉండడం విషాదం. పెళ్లికి వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది.
గార్లదిన్నె(శింగనమల) : హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిలోని గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంతకల్లు తిలక్‌నగర్‌కు చెందిన గోపాలకృష్ణ(67), ఆయన మనవరాలు అవంతిక(17) దుర్మరణం చెందారు. జ్యుడిషియల్ కోర్టులో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైర్డ్ అయిన గోపాలకృష్ణ ధర్మవరంలో జరిగిన తన సోదరుడి కుమారుడి పెళ్లికి కుటుంబంలో కలసి హాజరయ్యారు. ఆ తరువాత వారు హిందూపురం వెళ్లాల్సి ఉంది.
అయితే కుటుంబ సభ్యులందరినీ అక్కడే వదిలి మనవరాలితో కలసి ఆయన గుంతకల్లుకు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కల్లూరు సమీపంలోని ఈసర్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే రోడ్డుకడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జైంది. ఘటనలో కారులో ఉన్న గోపాలకృష్ణ అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అవంతికను 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కుటంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పెళ్లిలో గడిపన ఆనంద క్షణాలు గుర్తుచేసుకొని బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.