భారత్‌ బంద్‌ | Today bharath bundh | Sakshi
Sakshi News home page

భారత్‌ బంద్‌

Published Thu, Sep 1 2016 11:28 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

bundh - Sakshi

bundh

-  గ్యారేజీకి పరిమితం కానున్న బస్సులు
- మూతపడనున్న బ్యాంకులు
- కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా 
- సెలవు ప్రకటించిన ప్రైవేట్‌ విద్యా సంస్థలు 
 
ఒంగోలు టౌన్‌ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జిల్లాలో విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు సిద్ధమయ్యారు. పదిహేను రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సమ్మె పురస్కరించుకొని పోస్టల్, టెలికం, ఎల్‌ఐసీ కార్యాలతో పాటు బ్యాంకులన్నీ మూతపడే అవకాశాలున్నాయి. ఆర్టీసీలో బస్సులు గ్యారేజీకే పరిమితం కానున్నాయి. అనేక ప్రైవేట్‌ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, వైఎస్‌ఆర్‌టీయూ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 1991 నుంచి కేంద్ర కార్మిక సంఘాలు దశలవారీగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ వస్తున్నాయి. తాజాగా 17వసారి చేయనున్నారు.
రెండు లక్షలకు పైగా కార్మికులు పాల్గొనే అవకాశం
జిల్లాలోని వివిధ రంగాల్లో 515059 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్షా 50వేల మంది బిల్డింగ్‌ వర్కర్లు, 25వేల మంది ఆటో కార్మికులు, 25వేల పొగాకు గ్రేడింగ్‌ కార్మికులున్నారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో 26880, షాపు గుమస్తాలుగా 10900, గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో 5625, క్వారీల్లో 7000, ఇటుక బట్టీల్లో 5625, పలకల పరిశ్రమల్లో 3000, రెస్టారెంట్లు, హోటళ్లలో 5442 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా విద్యాశాఖలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన 9485 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, 5000 మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, 2985 మంది ఆశ కార్యకర్తలు, 187మంది మెడికల్‌ రిప్స్, 8600 మంది అంగన్‌వాడీలున్నారు. వీరంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆర్టీసీలో 4200 మంది కార్మికులుండగా, అందులో స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్, ఎంప్లాయీస్‌ యూనియన్‌కు సంబంధించిన దాదాపు 2500 మంది కార్మికులు పాల్గొననున్నారు.
భారీ ప్రదర్శన, సభకు ఏర్పాట్లు
సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలు నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి ప్రదర్శన ప్రారంభమై కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంటుంది. అక్కడ ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల నేతలు ఎండగట్టనున్నారు. సార్వత్రిక సమ్మెకు ఎన్‌జీఓ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement