ప్రారంభానికి సిద్ధమైన సంగంబండ రిజర్వాయర్
సంగంబండకు మోక్షం
Published Thu, Sep 15 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
మక్తల్: పాలమూరు జిల్లా వరప్రదాయిని భీమా ప్రాజెక్టుకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ జూపల్లి కృష్ణారావు భీమా ఫేజ్–1 నుంచి సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు 1995లో అప్పటి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. పనులు చేపట్టకపోవడంతో uమొదటి పేజీ తరువాయి
జలయజ్ఞం పేరిట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా 2004 నవంబర్ 24న మక్తల్‌లో మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి రైతుల్లో ఆశలు రేకెత్తాయి. దీనికి రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. చివరకు సంగంబండ రిజర్వాయర్ కింద ఇటీవల ఎడమకాల్వ పనులను పూర్తిచేశారు. రిజర్వాయర్‌కు 2.5కిలోమీటర్ల పొడవు మేర ఆనకట్టను నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్టు కింద 75వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వచ్చే ఖరీఫ్ నాటికి మాగనూర్, మక్తల్, నర్వ, ఆత్మకూర్, చిన్నచింతకుంట, వనపర్తి, కొల్లాపూర్, పెద్దమందడి, పెబ్బేర్, పాన్‌గల్, వీపనగండ్ల, కొల్లాపూర్, కొత్తకోట, దేవరకద్ర మండలాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
ప్రాజెక్టు స్వరూపం ఇలా..
మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్ వద్ద భీమా పంప్‌హౌస్‌కు లిఫ్ట్ చేస్తున్నారు. చిన్నగోప్లాపూర్ వద్ద ఫేజ్–1 పంప్‌హౌస్ నిర్మించారు. రెం డో పంప్‌హౌస్‌ను మక్తల్ సమీపంలో నిర్మించా రు. కృష్ణానది నుంచి గ్రావిటీ ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి మక్తల్‌లో నిర్మించిన ఫేజ్–1 పంప్‌హౌస్‌కు కెనాల్ ద్వారా నీరు సరఫరా అవుతుంది. అలాగే సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే వీలుంటుంది. ఫేజ్–1 ద్వారా భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో దాదాపు మక్తల్, మాగనూరు, నర్వ, ఆత్మకూర్ మండలాల్లో 1.11లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో ఈ ప్రాంతరైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఆశయం కోసం భీమాను సాధించి తీరిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement