సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైన కరోనా.. మళ్లీ జిల్లాలకు పాకుతోంది. గత 14 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాని జాబితాలో ఉన్న సూర్యాపేట, వికారాబా ద్, నల్లగొండ, నారాయణపేట్ జిల్లాల్లో మంగళవారం ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలతో పాటు జీహెచ్‌ఎంసీలో 38, రంగారెడ్డి జిల్లా ఏడు, మేడ్చల్ ఆరు, ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,991కు చేరింది. మంగళవారం హైదరాబాద్ పరిధిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. దీంతో మొత్తం మృతి చెందినవారి సంఖ్య 57కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 650 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 120 మంది కోలుకోగా, వారితో కలిపి 1284 మంది డిశ్చార్జి అయ్యారు.
14 రోజులుగా కేసులు నమోదు కాని జిల్లాలు..
ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాల జాబితాలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు సోమవారం నాటికి 25 ఉండగా, అవి మంగళవారం 21కి తగ్గాయి. ప్రస్తుతం 14 రోజులుగా నమోదు కాని జిల్లాల జాబితాలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, నాగర్‌కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, గద్వాల, జనగాం, నిర్మల్‌లు ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో మరో ముగ్గురికి కరోనా
కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారింట్లో ఇప్పటివరకు నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వర్క్ ఫ్రంహోం చేస్తు న్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (38)కు సోమవారం కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఆయుర్వేద ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా భార్య (31), కూతురు, వారి వద్ద ఉండే బావమరిది కుమారుడుకి పాజిటివ్‌గా తేలింది.
4 నెలల బాలుడికి కరోనా..
నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్‌లో 4 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాస్తవానికి జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఈ బాలుడిని ఈనెల 25న మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు పంపారు. మంగళవారం పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులను గాంధీ ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు. అలాగే వికారాబాద్ జిల్లా తాండూరులో ఏడాది బాలుడికి కరోనా సోకింది. వినాయక్‌చౌక్ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లో నివాసం ఉంటూ కిరాణ షాపు నిర్వహిస్తున్న వీరి కుటుంబం.. నాలుగు రోజుల కింద రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఓ విందుకు హాజరైంది. అయితే చిన్నారి మేనమామ కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. అనంతరం ఆయనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది.
ఏడు నెలల చిన్నారికి కరోనా
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండివెల్కిచర్లలో 7 నెలల బాబుకు కరోనా సోకింది. బొంరాస్‌పేట మండలం గౌరారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం.. 4 రోజుల కింద బండి వెల్కచర్లలో నిర్వహించిన ఓ శుభకార్యానికి హాజరైంది. అయితే ఇదే విందులో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు తెలియడంతో కార్యక్రమానికి వచ్చిన వారందరినీ హోంక్వారంటైన్ చేశారు. వీరిలో 10 మందికి పరీక్షలు చేయగా, నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలోఒకరు 7 నెలల చిన్నారి ఉన్నాడు.
ఆరు కుటుంబాలకు కరోనా..
దగ్గరి బంధువులైన ఆరు కుటుంబాలకు చెందిన దాదాపు 30 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. జియాగూడ, బోరబండ, గౌలిపురా, హర్షగూడ, సంతోష్‌నగర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లు వారి కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. వీరి అమ్మగారిల్లు పహాడీషరీఫ్ కాగా, జియాగూడలో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలంతా పహాడీషరీఫ్‌కు వచ్చారు. ఇదే సమయంలో బోరబండ, సంతోష్‌నగర్, గౌలిపురాకు చెందిన వారు కూడా పహాడీషరీఫ్‌కు వచ్చారు. కొందరు జియాగూడ నుంచి హర్షగూడకు కూడా వెళ్లారు. దీంతో ఐదుగురు అక్కా చెల్లెళ్ల కుటుంబాలతో పాటు అమ్మగారి కుటుంబం కరోనా బారిన పడింది. మొత్తం దాదాపు 30 మంది వరకు కరోనా బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సనత్‌నగర్ డివిజన్‌లో ఒకే కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల కింద 65 ఏళ్ల వృద్ధురాలికికరోనా రావడంతో ఆసుపత్రికి తరలించారు.
నలుగురు పోలీసులకు పాజిటివ్
హైదరాబాద్‌లోని స్పెషల్‌బ్రాంచ్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కింగ్ కోఠి ఆసుపత్రిలో పరీ క్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వలస కార్మికులను తరలించే క్రమంలో బహదూర్‌పుర, కామాటిపురా, షాలిబండ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లలో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అలాగే కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న ఓ స్టాఫ్ నర్సుకు పాజిటివ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment