నగరాన్ని టాప్‌లో నిలబెడుదాం
స్వచ్ఛ సర్వేక్షన్‌పై 12 వరకు విస్తృతంగా ప్రచారం చేయండి
పౌర స్పందనతోనే మెరుగైన ర్యాంకు
మేయర్ నన్నపునేని నరేందర్
వరంగల్ అర్బన్ : స్వచ్ఛత యాప్ డౌన్‌లోడ్, స్వచ్ఛ సర్వేక్షన్ 1969 టోల్‌ఫ్రీ కాల్‌లో పౌరులందరినీ భాగస్వామ్యం చేసి వరంగల్‌ను టాప్‌టెన్‌లో నిలబెడుదామని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కారోబార్లు, ఉద్యోగులతో మేయర్ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి స్వచ్ఛ సర్వేక్షన్–2017 పోటీల వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా చారిత్ర క ఓరుగల్లు ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలన్నారు. ఈనెల 12 వ తేదీ వరకు ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన ప్రతి పౌరుడు స్వచ్ఛత యాప్ డౌన్‌లోడు చేసుకునే విధంగా చూడాలన్నారు.
అంతేకాకుండా మొబైల్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 1969 మిస్డ్ కాల్ చేసి, 1 నెంబరుతో ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఝాన్సీ లక్ష్మి, మిర్యాల్ కార్ దేవేందర్, దామోదర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.